వారే బాంబులు పెట్టి పేల్చి
ఉంటారని అనుమానం
కమీషన్ల దృష్టి మళ్లించడానికే
కాంగ్రెస్ కాళేశ్వరం డ్రామాలు
ఘోష్ విచారణ పూర్తయిందని
చెప్పి ఇప్పుడు నోటీసులు
ఇవ్వడమేంటి? సర్వోన్నత
న్యాయస్థానమే కాళేశ్వరాన్ని
ప్రశంసించింది అన్నదాతలను
గాలికి వదిలి అందాల
పోటీల్లో రేవంత్ బిజీ
బిఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టి రైతాంగాన్ని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. మేడిగడ్డ పిల్లర్‌కు చిన్న పర్రె పడితే దాన్ని దాచి పెట్టి మొత్తం ప్రా జెక్టే కూలిందని కాంగ్రెస్ పార్టీ, ఎన్.డి.ఎస్.ఏ రిపోర్ట్‌తో కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్న బిజెపిని చూస్తుంటే ఈ అనుమానం ఇంకా బలపడుతుందని అన్నారు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుందని అన్నారు. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారని, ఈ కాంగ్రెస్, బిజెపి దొంగలే మేడిగడ్డ దగ్గర బాంబు పెట్టిన పేల్చేరేమోనని తన అనుమానం అ ని పేర్కొన్నారు. పాలమూరులాగానే కాళేశ్వరంలోనూ నిజం నిలకడగా తేలుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఓవైపు కాళేశ్వరం కూలిందని అంటూనే ఆ ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకొస్తానని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతమని ప్రశంసిస్తుంటే ఇక్కడి కాంగ్రెస్, బిజెపి నాయకులు మాత్రం దాని మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ కార్యకర్తలతో కెటిఆర్ సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని పెద్దలు అంటారని, బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పోయిన మాజీ మంత్రి ఇంద్రకరన్ రెడ్డిని చూస్తే ఈ సామెత నిజమే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
కష్టంకాలంలో కూడా తల్లి లాంటి పార్టీని నమ్ముకొని ఉన్నోడే నిజమైన నాయకుడు అవుతారని అన్నారు. బిఆర్‌ఎస్‌లో ఉన్న ఓ నాయకుడు కాంగ్రెస్‌లోకి పోతామంటే ఆ పార్టీ వాళ్లు వద్దు అని ధర్నాలు చేశారని, అయినా ఆ నాయకుడికి సిగ్గు రాలేదని మండిపడ్డారు. బిఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు జిల్లా మంత్రిగా అపారమైన గౌరవాన్ని పొంది, ఇప్పుడు కాంగ్రెస్‌లో కనీసం కూర్చోమని చెప్పే వాళ్ళు లేరని ఎద్దేవా చేశారు. మనం చేసే పనులతో, మన వ్యక్తిత్వంతోనే మనకు గుర్తింపు వస్తుంది తప్ప పదవులతో అధికారంతో రాదు అని పేర్కొన్నారు. పోయినోళ్ళు పోనీ ఉన్న వాళ్ళతోనే పార్టీని బలోపేతం చేసుకుందామని చెప్పారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్లో తిరిగి గులాబి జెండా రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం హైదరాబాద్ నుంచి అబ్జర్వర్లను పంపుతామని తెలిపారు. ఒక్కో ఊరు ఒక్కో నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గెలిచాక పార్టీని నమ్ముకుని ఉండే వాళ్లకు టికెట్లు ఇచ్చి గెలిపించుకుందామని అన్నారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మండలాల్లో మళ్లీ పార్టీని పటిష్టం చేసుకుందామని తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తలే తమ ప్రభుత్వ పాలనను ఇష్టపడడం లేదు
తెలంగాణలోని ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పాలన కంటే కెసిఆర్ పాలన బాగుంది అని చెబుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తమ ప్రభుత్వ పాలనను ఇష్టపడడం లేదని కెటిఆర్ పేర్కొన్నారు. రైతులు అయితే ప్రతి ఊర్లో బాధపడుతున్నారని అన్నారు. 100 శాతం రుణమాఫీ ఎక్కడ అయిందో చూపెట్టాలని అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే సైలెంట్‌గా ఉన్నారు తప్ప ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు.500 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే అందాల పోటీల్లో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని విమర్శించారు. వానలు పడుతుంటే కల్లాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, మొలకలు వస్తే రైతు ఆగమై రోడ్డుమీద పడే పరిస్థితి ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలందరూ సెక్రటేరియట్ చుట్టూ పైరవీలు కోసం తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం 20 శాతం నుంచి 30 శాతం కమిషన్ల చుట్టూనే తిరుగుతుందని,
కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు కావాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని మంత్రి సురేఖ చెప్పారని గుర్తు చేశారు. ఒక మహబూబ్‌నగర్ ఎంఎల్‌ఎ తమ మంత్రులంతా 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని బహిరంగంగానే చెబుతున్నారని చెప్పారు. 20 శాతం, 30 శాతం కమిషన్ ఇస్తే తమకు మిగిలిది ఏంటీ అని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేశారని అన్నారు. 17 నెలల కాలంలోనే కాంగ్రెస్ చేస్తున్న దోపిడీ బాగోతం తెలంగాణలోని ఊరూరుకి చేరిందని పేర్కొన్నారు. చరిత్రలో ఇప్పుడు దాకా చూడని విధంగా వరంగల్‌లో బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ జరిగిందని తెలిపారు. అందుకే తమ అవినీతి బాగోతం, కమిషన్ల దందాల నుంచి ప్రజల దృష్టినీ మరల్చడానికి కాళేశ్వరం విషయంలో కెసిఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.