Friday, August 15, 2025

తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయింది.. కెటిఆర్ ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది
స్వాతంత్య్రం అంటే సొంతంగా
పరిపాలించుకోవడమే కాదు ఆత్మగౌరవంతో బతకడం
సిఎం 51 సార్లు ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేశారు
రాష్ట్రంలో ప్రతి చిన్న పనికి ఢిల్లీ వైపే చూడాల్సిన దుస్థితి ఉంది
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
తెలంగాణ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఢిల్లీ కిరాయి పాలన మొదలైందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. స్వాతంత్య్రం అంటే సొంతంగా పరిపాలించుకోవడమే కాదు ఆత్మగౌరవంతో బతకడం అని పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలో పదేళ్ల పాటు ఆత్మగౌరవంతోనే బతికామని, కానీ ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పాలన తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దపడిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఢిల్లీ కిరాయి పాలన మొదలైందని, ఢిల్లీ పార్టీల పెత్తనం తెలంగాణలో నడుస్తుందని మండిపడ్డారు. 51 సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రి అప్ అండ్ డౌన్ చేశారని, ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన దుస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయిందని, తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మధుసూదనాచారి, బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వాతంత్రం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ తరపున బిఆర్‌ఎస్ తరపున హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన స్వేచ్చా, స్వాతంత్య్రాల కోసం బలిపీఠం ఎక్కిన వేలాది మంది త్యాగధనులకు, ఆనాటి నాయకత్వానికి వినమ్ర పూర్వక శ్రద్ధాంజలి ఘటించారు. 14 రాష్ట్రాలతో మొదలైన స్వతంత్ర భారతదేశ ప్రయాణం ఇప్పుడు 28 రాష్ట్రాల వైవిధ్య భారతంగా విలసిల్లుతుందని పేర్కొన్నారు. అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం బిఆర్‌ఎస్ పాలనలో భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తితో కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ పోరాటం జరిపి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు.

అభివృద్ధి, సంక్షేమం, తలసరి ఆదాయం, వ్యవసాయ విస్తరణలో అద్భుత విజయాలను సాధించి.. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని కెసిఆర్ నాయకత్వం నిజం చేసిందని అన్నారు. ఎక్కడో 14 స్థానంలో ఉన్న తెలంగాణ 10 ఏళ్లలోనే పంజాబ్, హర్యానాను వెనక్కి నెట్టి ధాన్యం ఉత్పత్తిలో అగ్రభాగాన చేరడానికి రైతును రాజునే చేయాలన్న కెసిఆర్ సంకల్పమే కారణం అని పేర్కొన్నారు. ఐటీ రంగం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పల్లె ప్రగతి, పేద వారికి సంక్షేమ కార్యక్రమాలు…ఇలా ఏ రంగం తీసుకున్న పదేళ్లలో భారత దేశానికే లైట్ హౌజ్‌లాగా తెలంగాణ నిలబడ్డదని చెప్పారు. 20 నెలల కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధ కలుగుతుందని అన్నారు. రైతులు రాజు చేయాలన్న కెసిఆర్ తపన పక్కకు వెళ్లిపోయిందని, స్వాతంత్ర దినోత్సవం వేళ యూరియా కోసం రైతులు చాంతాడంత లైన్లలో చెప్పులు పెట్టి క్యూ కడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్ళీ ఆనాటి పాత కాంగ్రెస్ రోజులను రేవంత్ రెడ్డి తీసుకొచ్చిందని విమర్శించారు. సంక్షేమంలో, వ్యవసాయంలో వెనుకబడిందని, ఐటీ, పరిశ్రమలు తరలిపోతున్నాయని చెప్పారు. దానికి ఢిల్లీ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ కారణం అని ఆరోపించారు. సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని, ఆత్మగౌరవంతో బతకాలని అన్నారు. కెసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు. కులం, మతం లాంటి ఎన్నో అంశాలు మనల్ని విడదీయవచ్చు… కానీ మనందరిని కలిపి ఉంచేది భారతీయత ఒక్కటే అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News