హైదరాబాద్: బీసీలకు బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ పదవులను ఇచ్చిందని.. బీసీని మొదటి అడ్వొకేట్ జనరల్ గా చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని కెటిఆర్ అన్నారు. తమ పార్టీలో 3 ప్రొటోకాల్ పొజిషన్లను బీసీలకే ఇచ్చామని స్పష్టం చేశారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు. ఆదివారం శాసనసభలో పంచాయతీ రాజ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో కెటిఆర్ మాట్లాడారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని, 50 శాతం సీలింగ్ తీసేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నాలుగుసార్లు మాట మార్చారని, సీఎం చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని కెటిఆర్ అన్నారు. బీసీ సబ్ ప్లాన్ చట్టంపై చర్చ జరిపేందుకు సభ నిర్వహించాలని కేటీఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. దీనికి స్పందించిన పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా ఒకరోజు దీనిపై చర్చిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లులో ఏ లోపాలున్నా, ఎలాంటి సూచనలున్నా చెప్పాలని కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరిగినపుడు కేటీఆర్ కూడా పాల్గొని ఉంటే బాగుండేదన్నారు. ఏదేమైనా ఈ బిల్లుపై ఏకాభిప్రాయంగా ముందుకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.