Friday, July 18, 2025

జీవ వైవిధ్యంపై గొడ్డలి వేటు

- Advertisement -
- Advertisement -

కాంక్రీట్ జంగిల్‌గా మారిన కూకట్‌పల్లి నడిబొడ్డన జీవివైవిధ్యం కలిగిన పచ్చటి అడవి గొడ్డలి వేటుకు విలవిలలాడుతోంది. నగరీకరణలో భాగంగా చుట్టూ పక్కల ఉన్న పారిశ్రామిక వాడలు, వాహన కాలుష్యం నుంచి కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలకు ఐడీఎల్ కంపెనీ భూముల్లో ఉన్న వనసంపదే ఊరట. నిజమైన జీవ వై విధ్యం ఈ అడవిని చూస్తే స్ఫస్టమవుతుంది. కూకట్‌పల్లి,కేపీహెచ్‌బీ, ఖైత్లాపూర్ ప్రాంతాల మద్య ఒక ద్వీపం మాదిరిగా 870.13 ఎకరాల్లో ఐడీఎల్‌కంపెనీ భూ ములు ఉన్నాయి. కంపెనీ ఉత్పత్తి యూనిట్లు మాత్రం మధ్యలో పది పదిహేను ఎ కరాల్లోపు మాత్రమే నిర్మించారు. డిటోనేటర్ తయారీ సమయంలో పరీక్షించేందుకు ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రభుత్వం తన ప్రభుత్వ భూమితోపాటు సమీపంలోని రైతుల సేకరించి ఇచ్చింది. కంపెనీ మరింత భూమి కావాలని కోరడంతో చుట్టూ ఉన్న ఉదాసీన్ మఠంకు చెందిన 530 ఎకరాల భూమిని లీజు రూపంలో ఇప్పించడం జరిగింది.

దీంతో సహజసిద్ద్ధమైన పెద్ద అడవిగా తయారైంది. ఇందులో వంద సంవత్సరాల వయస్సు పైబడిన వృక్ష సంపద కూడా ఉందని బాధిత రైతులు చెబుతున్నారు. దశాబ్ధాలుగా వృక్షసంపద పెరిగి దట్టమైన అడవిగా మారింది. లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉండేది. అందులో భయంకరమైన నాగుపాములు, కొండచిలువలతోపాటు వేలాది నెమళ్ళు, జింకలు, అడవిపందులు, కుందేళ్ళు, ఇతర జంతువులతోపాటు వివిధరకాల పక్షులు ఉండటంతో ఈ ప్రాంతం జీవ వైవిధ్యానికి నిలయంగా మారి బయోడైవర్సిటీని తలపిస్తొంది. కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారి నిత్యం రణగొణధ్వనులు, శబ్ధ, వాయు కాలుష్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఇది కొంత ఉరటగానే ఉంటూ వస్తోంది. స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ ఉపశమనం పొందేవారు.

ఐడీఎల్ కంపెనీనీ పూర్తి స్థాయిలో తొలగించి రియల్ దందాకు తెరలేపడంతో బడా నిర్మాణ సంస్థలు విలాసవంతమైనా విల్లాలు, టవర్ల నిర్మాణంతో మరో సైబర్ సిటీని సృష్టించేందుకు రంగంలోకి దిగాయి. ఈ భూముల్లో వెలిసే గృహాలు, వ్యాపార , వాణిజ్య సముదాయాలతో సుమారు 5 లక్షలపైగా జనాభాతో కిటకిటలాడే పరిస్థితి ఏర్పడునుంది అనేది ఓ అంచనా. అసలే ట్రాఫిక్ సమస్యతో అల్లాడుతున్న కూకట్‌పల్లి ప్రజలకు సమస్య రెట్టింపు కానుంది. గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడే మురుగు నీటితో పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐడీఎల్ చెరువుతోపాటు ఉన్న చిన్నచిన్న కుంటలు మురుగునీటితో నిండిపోయే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఐడీఎల్ పక్కనున్న రంగధాముని చెరువు పరిసర కాలనీలు, బస్తీల నుంచి వచ్చే మురుగు నీటి వ్యర్ధాలతో నిండిపోయి కాలుష్యకాసారంగా మారింది. కంపెనీ భూముల్లో వెలుస్తున్న నిర్మాణాలతో సమస్య మరింత జఠిలంగా మారే అవకాశం లేక పోలేదు.

ఐడీఎల్ కంపెనీ ఆనవాళ్ళు మాయం..!
1975లో ప్రారంభమైన కూకట్‌పల్లి ఐడీఎల్ కంపెనీ శకం ముగిసింది. ఐడీఎల్ కంపెనీని ఆదుకుంటానని నమ్మబలికి హస్తగతం చేసుకున్న హిందూజా తెరవెనుక రియల్ మంత్రాంగం నడిపి కంపెనీ నామ రూపాల్లేకుండా చేసింది. డిటోనేటర్ల తయారీ పరిశ్రమ పేరుతో నెలకొల్పబడిన ఈ ఈడిటేనేటర్ల ( ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్) సంస్థ 2003 వరకు తమ ఉత్పత్తిని నిరాటంకంగా కొనసాగించి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. తర్వాత నష్టాలు సాకుతో హిందూజా గ్రూపు గల్ప్ ఆయిల్ కార్పొరేషన్ ర్పొరేషన్ చేసుకుంది. హిందూజా అప్పటికే దేశంలో ఎన్నొ సంస్థలను ఆదుకుంటానని చెప్పి తర్వాత ‘రియల్ ’ ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకునే ఉద్దేశ్యంతో స్వాదీనం చేసుకున్నా ఉత్పత్తి అంతకంతకు తగ్గించి 2009 నాటికి రోజు వారీ కూలీలతో అలంకారప్రాయంగా మార్చివేసింది. ఇదంతా అందులో పనిచేసే కార్మికులకు, సంఘాలకు, స్థానికులకు తెలిసిందే. ప్రతి ఏటా డిటోనేటర్ల బ్లాస్టింగ్ పేలుళ్ళ ఘటనలో పదుల సంఖ్యలో జరగడం,

అందులో పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందడం వెనుక కూడా ఏదైనా కుట్రకోణం ఉండవచ్చా అన్న మానం ఇప్పుడు స్థానికుల్లో అనుమానం రేపుతుంది. ‘మంచి కుక్కకు పిచ్చి కుక్క అనే పేరుపడిన తరువాతే మంచికుక్కను చంపితే సమాజం నుంచి ఎలాంటి వ్యతిరేఖత ఉండదు’ అన్న నానుడిని నిజం చేసినట్లుగా ఈ తతంగం నడిచినట్లు తెరవెనుక పాలకులు, ప్రజాప్రతినిధులు సహకారాలు అందించడం మూలంగా ఐడీఎల్ కంపెనీ శకం సంపూర్ణంగా ముగిసినట్లైందని పర్యావరణ ప్రేమికుడొకరు వ్యాఖ్యానించారు. విలువైన భూములను దక్కించుకోవాలన్న లక్షంగా ఇప్పటి వరకు నెట్టుకొచ్చిన సంస్థ ఇప్పుడు అసలు లక్షం, ఉద్దేశ్యంతో నెరవేరడంతో ఈనెల 27న కంపెనీ మేనేజ్‌మెంట్ జులై31తో కంపెనీనీ పూర్తిగా మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు కార్మికయూనియన్ నాయకుడొకరు తెలిపారు.

ప్రస్తుతం కంపెనీలో 39 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వారి సర్వీసు, వయస్సును బట్టి 15 నుంచి 30లక్షలలు ఇచ్చి వాలంటరీ రిటైర్మెంట్‌తో ఇంటికిపంపాలని తీర్మాణించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి కంపెనీ మేనేజ్‌మెంట్,కార్మిక సంఘ నాయకుల మద్య ఈనెల 27న జరిగిన సమావేశంలో ఒప్పందం జరిగినట్లు కంపెనీ యూనియన్ నాయకుడు వెల్లడించారు. ఈ నిర్ణయంతో 5దశాబ్ధాల ఐడీఎల్ కంపెనీ శకం ముగిసినట్లైందని కార్మిక నాయకుడు తెలిపారు.గత పదేళ్ళుగా కేవలం ఉత్పత్తిలేక , నిర్వాహణలేక మిషనరీ పూర్తిగా స్క్రాప్‌కు తరలిపోగా శిధిలవావస్థలో ఉన్న ఉత్పత్తి తయారీ షెడ్లు, భవనాలు నేలమట్టం కానున్నాయి. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కూకట్‌పల్లి లోని భూములే ఏకైక లక్షంతో షేర్ల పెట్టుబడి పేర్లతో ఐడీఎల్‌లోకి చొరబడి తర్వాత నష్టాల సాకుచూపి కంపెనీని మూసివేసేదశకు తీసుకువచ్చిన సదరు సంస్థ తన రెండు దశాబ్దాల కలను పరిపూర్ణంగా నెరవేర్చుకోనుంది.

333 ఎకరాల్లో కొనసాగుతున్న బహుళాంతస్థుల నిర్మాణాలు
ఐడీఎల్ కంపెనీ కోసం ప్రభుత్వం ఇచ్చిన 870.13 ఎకరాల్లో బఫర్ జోన్‌కోసం ఉదాసీన్‌మఠం నుంచి 99 ఏళ్ళ లీజు పద్దతిలో ఇచ్చిన 538.01 ఎకరాలను హిందూజా అసలు ఉద్దేశ్యాన్ని, రియల్ దందా ఎత్తుగడలను పసిగట్టి న ఆ సంస్థ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రింకోర్టు మెట్లెక్కి 10ఏళ్ళు పోరాడి మరీ రెండేళ్ళ క్రితం హిందూజా చెరనుంచి బయటపడింది. ఇక రైతుల నుంచి తీసుకున్న 151.08 ఎకరాలతోపాటు ప్రభుత్వానికి చెందిన 181.13 ఎకరాలు కలిపి మొత్తం ౩౩౩ ఎకరాలను 2009లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 302 జీవో ఆదారంగా గల్ప్ ఆయిల్ కార్పొరేషన్ (హిందూజ) 2022లో పూర్తి స్థాయిలో తన మాతృ సంస్థలో ఒకటైన హిందూజా ఎస్టేట్‌కు బదలాయించడం, వాయు వేగంతో హిందూజ ఎస్టేట్ సంస్థ తన వ్యూహాత్మక ఎత్తుగడలు, అడుగులతో రియల్ వ్యాపారానికి దిగిన విషయాన్ని గత ఏడాది జులై మాసంలో ‘మన తెలంగాణ’ తన వరుస కథనాల్లో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

అప్పుడే ఆ సంస్థ పూర్తి స్థాయిలో మొత్తం భూమికి లే అవుట్ రూపొందించి దందాకు తెరలేపిందని స్పష్టంగా చెప్పడం జరిగింది. పది ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాలు చొప్పున ప్లాట్లుగా లే అవుట్‌రూపొందిని హిందూజ రియల్‌ఎస్టేట్ సంస్థ రాష్ట్రంలో, దేశంలో పేరిన్నిక గన్న బడా నిర్మాణ సంస్థలకు విక్రయించడంతోపాటు కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌లు కూడా చేసి స్థలాలను అప్పగించింది. స్థలాలను కొనుగోలు చేసిన సైబర్‌సిటీ,హనర్ వంటి సంస్థలు చుట్ట సెక్యూరిటీని పెట్టి ఇష్టాను సారంగా చెట్లను నరికివేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వాటిని తరలిస్తున్నారు. భారీ యంత్రాలతో ప్రతిరోజు వేలాది భారీ వృక్షాల సంస్థల రియల్ దాహానికి బలవుతున్నాయి. బయట సమాజానికి ఎవరికి అనుమానం రాకుండా రోడ్డు చుట్టు పక్కల 30 మీటర్ల వరకు చెట్లను ముట్టుకోకుండా అడవి మద్యలో గుండు గీకినట్లు స్థలాలను చదను చేస్తున్నారు. మరో వైపు నిర్మాణ పనులకు కావల్సిన సామగ్రిని తరలిస్తూనే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News