Sunday, September 14, 2025

విలీన దినోత్సవాన్ని ప్రజాపరిపాలన దినంగా జరపొద్దు:కూనంనేని

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘సెప్టెంబర్ 17’ను గత ఏడాది తెలంగాణ ప్రజాపరిపాలన దినంగా నిర్వహించారని, ఈ ఏడాది కూడా అదే పేరుతో నిర్వహించనున్నట్లు తమకు తెలిసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు తెలిపారు. అయితే విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినంగా నిర్వహించడం వల్ల నాటి చారిత్రాత్మక పోరాటాన్ని ఏ మాత్రం ప్రతిబింబించడం లేనందున “తెలంగాణ విలీన దినోత్సవం”గానే నిర్వహించడం సముచితమని పేర్కొన్నారు. ఇందుకు తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. ఈ మేరకు ఆ వివరాలతో కూడిన ఒక ప్రకటనను కూనంనేని విడుదల చేశారు.

నాటి మహత్తర తెలంగాణ స్వాతంత్య్రోద్యమ, రైతాంగ సాయుధ పోరాట చరిత్రను రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాఠ్యాంశాలలో చేర్చాలని ఆయన సిఎంకు సూచించారు. అమరవీరుల స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అందులో ఆనాటి పోరాటంలో అసువులు బాసిన అమరుల పేర్లను, ఫోటోలను ప్రతి గ్రామం నుంచి అధికారికంగా సేకరించి భావితరాలకు మార్గదర్శకంగా ఉండేలా స్మారక కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు. హైదరాబాద్‌లో నాటి పోరాట యోధులు రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి ఒకే చోట, దొడ్డి కొమరయ్య, షేక్ బందగీ, బొమ్మగాని ధర్మభిక్షం, చాకలి ఐలమ్మ లాంటి ఆనాటి సాయుధ పోరాట యోధుల విగ్రహాలను ముఖ్య ప్రదేశాలలో ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కూనంనేని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

తొలి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూను మించిన మెజారిటీ పొందిన ప్రజానాయకుడు రావి నారాయణరెడ్డి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టాలని కోరారు. నాటి తెలంగాణ స్వాతంత్య్ర పోరాట నాయకుల పేర్లు చిరస్థాయిగా నిలిచే విధంగా వివిధ ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు నామకరణం చేయాలని సూచించారు. పలు సభలలో నాటి కమ్యూనిస్టు పార్టీ, నాయకులు చేసిన వీరోచిత పాత్రను శ్లాఘించడం, అలాగే వీరనారి చాకలి అయిలమ్మ పేరును మహిళా యూనివర్సిటీకి, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టినందుకు కమ్యూనిస్టు పార్టీ తరపున ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నామని సిఎంకు తెలియజేశారు. చరిత్రపై సంపూర్ణ అవగాహన ఉన్న వారిగా పై ప్రతిపానలను కూడా సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నానని కూనంనేని వెల్లడించారు.

Also Read: సింగరేణి మనుగడును ప్రభుత్వం కాపాడాలి:కొప్పుల ఈశ్వర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News