రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం కొనసాగుతోందని, ప్రతి పనిని చిత్తశుద్ధితో పూర్తిచేయడమే కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి పనిని పూర్తిచేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ములుగు జిల్లా, మంగపేట మండలంలోని శనిగకుంటలో అగ్నిప్రమాద బాధితులకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. గత సంవత్సరం జరిగిన అగ్ని ప్రమాదంలో శనిగకుంటలోని కొన్ని కుటుంబాలు సర్వస్వం కోల్పోగా ఆ క్షణమే తమ పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాలకు వంట సామాన్లతో పాటు బట్టలను అందజేశామని అన్నారు. 300 స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాధిత కుటుంబాలకు సహాయం అందించామని వివరించారు. అగ్ని ప్రమాద బాధితులు ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసం కల్పించడానికి ప్రత్యేక సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు
ఐటిడిఎ ద్వారా ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రస్తుత వేసవికాలంలో జిల్లాలో ఎక్కడా మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని పేదలెవరూ ఆందోళన చెందవద్దని ,రెండవ దఫా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్న లబ్ధ్దిదారులకు త్వరితగతిన బిల్లులు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుదూ.. శనిగకుంట గ్రామంలో నీటి సమస్య ఉన్న కారణంగా గ్రామస్థులు నీటిని నిలువ చేసుకొని సేవించడం వలన అనేక వ్యాధుల బారిన పడ్డారని, మంత్రి ఆదేశాలతో పూర్తిస్థాయిలో మంచినీటి సమస్యను తీర్చామని అన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చీమలపాటి మహేందర్‌జీ, తహసిల్దార్ రవిందర్, ఎంపిడిఒ భద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.