జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని వైష్ణోదేవి మందిరానికి వెళ్లే పాత ట్రాక్‌పై సోమవారం భారీ కొండచరియలు విరిగిపడటంతో 70 ఏళ్ల తీర్థయాత్రికుడు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. త్రికూట కొండలపై ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శించే తీర్థయాత్రికులు, బేస్ క్యాంప్ ఉన్న కాట్రా పట్టణంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన బరువుకు బుకింగ్ కార్యాలయం, ఓ ఇనుప నిర్మాణం కూలిపోయాయని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో యాత్రను అనేక గంటలపాటు రద్దుచేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీర్థయాత్రికుడి మరణంపై విచారం వ్యక్తం చేయడమేకాక, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటన ఉదయం 8.30 గంటలకు బంగంగా సమీపంలోని గుల్షన్ కా లంగర్ వద్ద జరిగింది, యాత్ర ప్రారంభ స్థానం అయిన ఇక్కడ పొట్టి గుర్రాలు నడిపేవారు.. యాత్రికులను 12కిమీ. దూరంలో ఉన్న గుహ మందిరానికి తీసుకెళ్లేందుకు పేర్లను నమోదుచేసుకోడానికి గుమిగూడి ఉంటారు. శిథిలాలను తొలగించే రెస్కూ ఆపరేషన్లను పూర్తి స్థాయిలో చేపట్టినట్లు జమ్ము జిల్లా మెజిస్ట్రేట్ వైశ్య తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం సోమవారం ఉదయం 8.30 గంటలకు ముగిసిన వర్షం కాట్రా పట్టణంలో 184.2 మిమీ. మేరకు కురిసింది. హింకోటి మార్గంలో కూడా ఆదివారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డంతో మార్గం బ్లాక్ అయింది. ఆ మార్గాన్ని కూడా పునరుద్ధరించే పని కొనసాగుతోంది. ఇదిలావుండగా తారాకోటే మార్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు.