Sunday, July 20, 2025

కమలనాథుల భాషావేషాలు

- Advertisement -
- Advertisement -

రెండు దేశాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాల గురించి విన్నాం. అలాగే నీటి పంపకాల దగ్గర కూడా తగాదాలు చూశాం. ఇప్పుడు కొత్తగా భాష అనేది మనుషుల్ని విడదీసి వైషమ్యాలు సృష్టించేదిగా తయారు చేస్తున్నారు. భాష మనుషులను కలపాలి. పరస్పర సంభాషణ ద్వారా మనుషుల మధ్య సుహృద్భావ వాతావరణం, సత్సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాకాకుండా భాష పేరుతో ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఏర్పడటానికి కారణం ఎవరు?ప్రస్తుతం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హిందీని అధికార భాషగాను, జాతీయ భాషగాను సుస్థిరం చేయడం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తున్నట్టు అర్థం అవుతున్నది. హిందీయేతర రాష్ట్రాల వాళ్ళు హిందీ నేర్చుకోవడంలో తప్పులేదు. ఉత్తరాదిలో, మధ్య భారతదేశంలో అత్యధిక శాతం ప్రజలు హిందీ మాట్లాడతారు కాబట్టి సంభాషణ సులభం కావడం కోసం, మనం మాట్లాడేది అవతలి వాళ్లకు అర్ధం కావడం కోసం ఆ భాష నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే ఆ భాషను బలవంతంగా రుద్దాలని ప్రయత్నించడం సరైంది కాదు.

ఇంగ్లీషు ప్రపంచ భాషగా ఉన్నది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడంవల్ల ఉండే ప్రయోజనాల గురించి ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఏ రాష్ట్రమైనా తన మాతృభాషను తప్పనిసరిగా గౌరవించాల్సిందే. ప్రతి పౌరుడు నేర్చుకోవాల్సిందే. మంచి భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో హిందీ కూడా ఒక భాషగా ఉండటంలో, నేర్చుకోవడంలో ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. అయితే హిందీని రుద్దుతాం అంటేనే అభ్యంతరం.
హిందీని సమర్ధించుకునే తొందరలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లంతా త్వరలో సిగ్గుపడే రోజు వస్తుంది అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం సిగ్గుపడే విషయం ఎలా అవుతుందో ఆయనకే తెలియాలి. ఆయన వ్యాఖ్యలపట్ల పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో కొద్దిరోజులకే ఆయన కేంద్ర ప్రభుత్వ అధికార భాషా విభాగపు స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొంటూ హిందీ భాషను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. హిందీ భారతదేశంలోని ఇతర ఏ భాషకూ విరోధి కాదు, పైపెచ్చు ఒక స్నేహితురాలు అంటారాయన. ఏదేమైనా హిందీ భాషను నిర్బంధం చేసే ప్రయత్నాలపట్ల వ్యతిరేకత వ్యక్తం కావడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర భాషలకు సంబంధించిన వారు హిందీని తమ మీద బలవంతంగా రుద్దడాన్ని అంగీకరించబోమని బహిరంగంగానే చెప్తున్నారు. అంతేకాదు, భాషావివాదం కాస్తా రాజకీయాల్లోకి కూడా ప్రవేశించి అసలే కలుషితమై ఉన్న వాతావరణాన్ని మరింత విషతుల్యం చేస్తున్నది.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యావిధానాన్ని ఆమోదించే ప్రసక్తే లేదు పొమ్మన్నది. హిందీని నిర్బంధంగా తమ రాష్ట్రంలో నేర్పించే ప్రసక్తి లేదని చెప్పింది. తమిళనాడులో కాషాయ జెండా రెపరేపలాడటం చూడాలని తహతహలాడిపోతున్న జనసేన నేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంత తెలుగులో రాసుకొచ్చి హిందీలో ప్రసంగించినా ప్రయోజనం కనబడటం లేదు.ఇక తమిళనాడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మెప్పించడానికి అధికార కూటమిలోనిప్రధాన భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పోటీలు పడి మరీ హిందీని పొగుడుతున్నారు. ఇటీవల ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ హిందీ మన జాతీయభాష అంటూ తన అజ్ఞానాన్ని వెల్లడించుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కూడా. ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టు హిందీ జాతీయభాష కాదు అని చెప్తున్నా వినిపించుకోకుండా ‘నేను నేర్చుకున్నాను కదా హిందీ’ అన్నారాయన. ఆయన తండ్రి కూడా హిందీ నేర్చుకోవాల్సిందే అని చెప్తున్నారు. మోడీ కటాక్షవీక్షణాల కోసం తండ్రీకొడుకులు చేస్తున్న కసరత్తులో భాగం ఇది.

మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకుంటేనే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని చెప్తూ హిందీ కూడా ఒక భాషగా ఉండటంలో తప్పులేదు, ఆ భాష కూడా నేర్చుకోవడంలో తప్పులేదు అన్నారు. ఆయన ప్రభుత్వ హయాంలోనే ఆ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.మహారాష్ట్రలో ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి హిందీని తప్పనిసరి భాష చేసేసారు. దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. అల్లర్లు కూడా జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలోని పౌర సమాజం, భాషా సమర్థకులు, ప్రతిపక్షాలు ఉత్తరాదిలోనూ, మధ్య భారతదేశంలోని రాష్ట్రాల్లోనూ మాట్లాడే హిందీని తమ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ హిందీ వివాదం చాలాకాలం తరువాత బాల్ థాకరే వారసులు ఉద్ధవ్, రాజ్ థాకరేలను కలిపింది.
భారతదేశంలో భాష అనేది చాలా సున్నితమైన అంశం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పలు రాష్ట్రాలు భాషాప్రాతిపదికనే ఏర్పడ్డాయి. అందులో మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. ప్రాంతీయభాషను ఆ ప్రాంతపు అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా చూస్తారు. మరి అటువంటి భాష విషయంలో ఎందుకు కేంద్రంలోని ప్రధాన భాగస్వామ్యపక్షం భారతీయ జనతా పార్టీ ఇటువంటి వివాదాస్పద వైఖరి తీసుకున్నదో అర్థం కాదు.

బహుశా హిందీ మాట్లాడే హిందుత్వ దేశంగా భారతదేశాన్ని మలచాలని అనుకుంటున్నారేమో. కర్ణాటక విషయానికొస్తే భారతదేశపు సిలికాన్ వ్యాలీగా ప్రఖ్యాతి చెందిన బెంగళూరులో కన్నడ భాష యాక్టివిస్టులు నేమ్ బోర్డులు ఇంగ్లీషులోనే కాదు, కన్నడంలోనూ ఉండాలని ఉద్యమం చేసిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తమిళంనుంచి కన్నడ భాష పుట్టిందన్న ప్రఖ్యాత నటుడు కమలహాసన్ సినిమాను కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకున్న పరిస్థితిని మనం చూసాం.
బీహార్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. అక్కడ రోహింగ్యాలన్న నెపంతో కొన్ని వందల మంది బెంగాలీ మాట్లాడేవారి ఓట్లు తొలగించేసారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రస్తుతం పెద్దయెత్తున ఉద్యమం చేస్తున్నారు. హిందీని జాతీయ భాష చేయడానికి, అన్ని రాష్ట్రాల్లోనూ అధికార భాష చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ఎంత వ్యతిరేకత వ్యక్తమైనా కొనసాగుతూనే ఉంటాయి. ఈ భాషావివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

కొసమెరుపు
పొద్దున్నే అలవాటుగా దినపత్రికలు తిరిగేస్తుంటే సీరియస్ వార్తలతో పాటు కొన్ని నవ్వు పుట్టించే వింత వార్తలు, విచిత్ర వ్యాఖ్యానాలు కూడా కనబడతాయి. శనివారంనాటి దినపత్రికలు చూస్తుంటే పత్రికలు వండి వడ్డించిన అలాంటి రెండు మూడు వింతలు విడ్డూరాలు కనిపించాయి. అందులో మొదటిది కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు కంటతడి పెట్టడం. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న కారణంగా ఆయన పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. 40 ఏళ్లపాటు టీడీపీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిస్వార్థ సేవ చేసి ఇప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చినందుకు ఆయన బాధ. ఇందులో నవ్వొచ్చే విషయం ఏముంది అని ఎవరైనా అనుకోవచ్చు. గవర్నర్లకు రాజకీయాలతో సంబంధం లేదా, గవర్నర్లు కాగానే రాజకీయాలను పూర్తిగా త్యజించి పరిశుద్ధులై పోతున్నారా? రాజభవన్ లలో కూర్చుని పక్కా రాజకీయ స్కెచ్ లు వేసే నాయకులను ఎంతమందిని చూడలేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యూపీఏ ప్రభుత్వం సుశీల్ కుమార్ షిండేని గవర్నర్ గా పంపించింది. ఆయన అప్పటికే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.

రాజకీయాల్లో మునిగితేలుతున్న వ్యక్తి. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఆయన ఆ సీటులో ముళ్ళ మీద కూర్చున్నట్టే గడిపాడు. ఎప్పుడెప్పుడు కేంద్రానికి వెళ్లి పోదామా, ఎప్పుడు కేంద్ర హోం మంత్రి అయిపోదామా అన్నదే ఆయన ఆలోచన. చాలా తక్కువ కాలంలోనే ఆయన మళ్ళీ కేంద్ర మంత్రిగా వెళ్ళిపోయారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్ గా పదవీకాలం అయిపోగానే హైదరాబాద్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ భవన్ అంటే బిజెపి రాష్ట్ర కార్యాలయం వెళ్లి మళ్లీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు పార్టీ అధ్యక్షురాలిగా పనిచేసి, తెలంగాణ గవర్నర్ గా వచ్చిన డాక్టర్ తమిళసై మళ్లీ వెళ్లి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోలేదా? ఇవన్నీ మామూలే. గోవా గవర్నర్ పదవి కాలం పూర్తయ్యాక అశోక్ గజపతిరాజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి, రాజకీయాలు చేయవచ్చు, బాధపడనేల?

ఇంకో వార్త చూద్దాం. చిత్తశుద్ధి ఉంటే బీసీని సీఎం చేయాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గర పెండింగులో ఉన్న విషయం రామచంద్రరావుగారికి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించే బదులు రామచంద్రరావు తమ పార్టీవారే అయిన గవర్నర్ గారిని ప్రసన్నులను చేసుకుని ఆర్డినెన్స్ ఆమోదం పొందేట్టు చూస్తే బాగుండేది. అయినా అధ్యక్ష రేసులో ఉన్న పలువురు బీసీలను వెనక్కి నెట్టేసి ఆ పీఠం దక్కించుకున్న రామచంద్రరావు ఇటుపక్క అంజిరెడ్డిని, అటుపక్క రఘునందనరావుని కూర్చోబెట్టుకొని బీసీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రశ్నించడం వింతగొల్పే విషయమే కదా.
ఇక మధ్య నిషేధం గురించి రోజూ ఊదరగొట్టే ఉపన్యాసాలు, ప్రకటనలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం.

ఒకసారి సంపూర్ణ మధ్య నిషేధం విధించిన రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మద్యం ఎంత ఏరులై పారుతోందో చూస్తున్నాం. దీనికి తోడైంది కల్తీ కల్లు స మస్య. తాజాగా హైదరాబాద్ లో కల్లు విక్రయాన్ని నిషేధించే ప్రయత్నం జరుగుతున్నది. అలాంటిది జరిగితే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేస్తామని భారత రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో కొద్దిమంది పత్రికాగోష్ఠి నిర్వహించి మరీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కల్లు నిషేధిస్తే తాము అధికారంలోకి వచ్చి తిరిగి ప్రారంభించామని శ్రీనివాస్ గౌడ్ గొప్పగా చెబుతున్నారు. 2004లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జంట నగరాలలో కల్తీకల్లు బారినుండి ప్రజలను కాపాడటానికి చాలా పెద్ద కసరత్తే చేసింది అప్పటి ప్రభుత్వం. రాజకీయంగా కొంత నష్టం జరుగుతుందని తెలిసి కూడా జంటనగరాలలో కల్లు నిషేధించే సాహస నిర్ణయాన్ని రాజశేఖర్ రెడ్డి తీసుకున్నారు.

కల్తీకల్లు విక్రయాలకు తాము వ్యతిరేకమే అని దీర్ఘాలు తీస్తున్న ఇప్పటి గౌడ నాయకులు అసలు సిసలైన కల్లు ఎక్కడినుంచి హైదరాబాద్ కు వస్తున్నదో ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తే బాగుంటుంది. కొద్దిగా కల్లు వస్తుంటే అందులో కొన్ని నీళ్లు కలిపి లేదా మరేదైనా కలిపి అమ్ముతున్నారా అంటే అదీ లేదు, అసలు తాటిచెట్లే లేని కాంక్రీట్ జంగల్ హైదరాబాదులో వేల లక్షల లీ టర్ల కల్లు ఎలా ఉత్పత్తి అవుతోందో నాయకులు చెప్పాల్సిందే. ప్రజల ప్రాణాల రక్షణ ప్రభుత్వాల బాధ్యత. రాజశేఖర్ రెడ్డి బాటలో నడిచి, రాజకీయంగా కొంత నష్టమైనా సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లును పూర్తిగా నిషేధిస్తుందా లేక బీఆర్‌ఎస్ బాట పట్టి, మద్యం ఏరులై పారుతుండగా, అడ్డగోలు డ్రగ్స్ దందా నడుస్తుండగా ఈ కల్తీకల్లు మాత్రం ఏం పాపం చేసిందని వదిలేస్తుందా చూడాలి.

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News