న్యూఢిల్లీ : భాష అనేది మతం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. నేమ్ బోర్డుల్లో ఉర్దూను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. మున్సిపల్ కౌన్సిల్ పరిధి లోని నేమ్ బోర్డులపై మరాఠీతోపాటు ఉర్దూను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర లోని అకోలా జిల్లా పాటూరు మాజీ కౌన్సిలర్ వర్షతాయ్ సంజయ్ బగాడే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మున్సిపల్ కౌన్సిల్‌లో జరిగే పనులన్నీ మరాఠీ లోనే నిర్వహించాలని, ఉర్దూను సైన్‌బోర్డులపై ఉపయోగించడానికి అనుమతించకూడదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె అభ్యర్థనను మున్సిపల్ కౌన్సిల్ తిరస్కరించింది.
ఆ తర్వాత బాంబే హైకోర్టులో పిటిషన్ వేయగా, అక్కడా అనుకూలంగా ఫలితం రాలేదు. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సుధాంశ్ ధులియా , జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “ భాష ఒక సమాజానికి , ఒక ప్రాంతానికి ప్రజలకు చెందినది. ఒక మతానికి సంబంధించినది కాదు. భాష అనేది ఒక సంస్కృతి, ఒక సమాజం, ప్రజల నాగరికత పురోగతిని కొలవడానికి ఇది ఒక కొలమానం. ఉర్దూ విషయంలో కూడా అంతే ”అని ధర్మాసనం స్పష్టం చేసింది. స్థానికులు చాలామంది ఆ భాషను అర్థం చేసుకున్నందున ఉర్దూను నేమ్‌బోర్డుల్లో మున్సిపల్ కౌన్సిల్ అలానే ఉంచిందని కోర్టు వ్యాఖ్యానించింది. మున్సిపల్ కౌన్సిల్ చేయాల్సిందల్లా సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను రూపొందించడమే అని పేర్కొంది. 2022 చట్టం లేదా ఏ చట్టం లోని నిబంధనల్లోనూ ఉర్దూ వాడకంపై నిషేధం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తాము ఏకీభవిస్తున్నామని చెప్పి అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.