ఫిరాయింపుల పర్వం అనాదిగా కొనసాగుతున్నది. కలియుగంలోనే కాదు త్రేతాయుగంలోనూ ఫిరాయింపులు జరిగినట్లు చరిత్ర పుటల్లో సాక్షాలు ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరామునికి రావణబ్రహ్మకు మధ్య భీకర యుద్ధం జరగడానికి కొన్ని రోజుల ముందు రావణుని సోదరుడు విభీషణుడు తన అన్న నిర్వాకం నచ్చక శ్రీరాముని చెంతకు చేరినట్లు పురాణాల్లో స్పష్టమవుతున్నది. ఇక్కడ విభీషణుడు అన్నను కాదని శత్రుపక్షానికి ఫిరాయించినట్లు ద్యోతకమవుతున్నది. ద్వాపర యుగంలోనూ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు దాన వీర శూరుడైన కర్ణున్ని సంప్రదించి కౌరవ పక్షాన్ని వీడి పాండు పుత్రుల పక్షానికి ఫిరాయించాల్సిందిగా సూచన చేసినట్లు మహాభారతంలో ఉంది.
కర్ణుడు ఉదయమే సూర్యునికి ఆర్ఘమిచ్చి వెనుదిరిగిన సమయంలో శ్రీకృష్ణుడు మెల్లగా అక్కడికి చేరుకుని ‘బావా’ అని సంబోధించినట్లు చరిత్రలో ఉంది. అందుకు కర్ణుడు విస్తుపోయి, ఈ పిలుపులో ఏదో మర్మం ఉందనే ఆలోచనతోనే విషయమేమిటని శ్రీకృష్ణున్ని ప్రశ్నించగా, ఫిరాయింపు (When asked Lord Krishna) గురించి తన అభిమతాన్ని వివరించారని, అందుకు కర్ణుడు ససేమిరా అన్నారని విన్నాం. తనను ఆప్తమిత్రునిగా నమ్మిన సుయోధనున్ని వీడి రాలేనని, నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేనని కర్ణుడు తెగేసి చెప్పినట్లు కూడా మహాభారతంలో ఉంది. కర్ణుడు సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాడని, శ్రీకృష్ణుని మాయలోపడి మిత్రద్రోహం చేయకుండా గట్టిగా నిలబడ్డారని స్పష్టమైంది. త్రేతాయుగం, ద్వాపరయుగంలో ఫిరాయింపుల ప్రస్తావన ఉన్నా కలియుగంలోనూ ఫిరాయింపుల పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో, పార్లమెంటులోనూ అనేక పర్యాయాలు ఫిరాయింపులు జరిగాయి.
ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా భావించి రాజకీయాల్లోకి వస్తున్న నాయకులు వివిధ సందర్భాల్లో ఒక పార్టీని వీడి మరో పార్టీలోకి మారడం (ఫిరాయించడం) జరుగుతూనే ఉన్నది. నాయకులు పార్టీ మారితే తప్పేమీ లేదు. అక్కడి నాయకత్వ వ్యవహార శైలి లేదా అనుసరిస్తున్న విధానాలు నచ్చకనో నాయకులు, కార్యకర్తలు తమకు నచ్చిన పార్టీలోకి ఫిరాయిస్తే ప్రశ్నించే వారెవ్వరూ ఉండరు. కానీ ప్రజల ఓట్లతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారే నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి పార్టీ ఫిరాయించినప్పుడు చిక్కులు వస్తున్నాయి. ఫలానా పార్టీ గుర్తుపై పోటీ చేసినందున, ఓటర్లకు ఆ అభ్యర్థి పోటీ చేసిన పార్టీ సిద్ధాంతాలు నచ్చడమో లేదా వ్యక్తిగతంగా అభ్యర్థి గుణగణాలు నచ్చి చట్టసభకు గెలిపించారని, అది ఓటర్ల తీర్పుగా భావించాల్సిందే. కానీ అలా జరగడం లేదు.
ప్రజల తీర్పుకు భిన్నంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కొందరు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెల్లారేసరికి మరో పార్టీ కండువా కప్పుకుని ప్రజలకు షాక్ ఇస్తున్నారు. ప్రత్యర్థి పార్టీని తూర్పారబట్టి, అవసరమైతే బూతులు మాట్లాడి మర్నాడే ఆ పార్టీ గూటిలో ప్రత్యక్షం కావడం, ప్రజలు ముక్కు మీద వేలేసుకోవడం పరిపాటి అయ్యింది. ఇక ప్రజలు చేయగలిగిందేమీ లేదు. కాబట్టి ఏ పార్టీ గుర్తుపై గెలుపొందిన వారు తమ పదవీకాలం ముగిసేంత వరకూ అదే పార్టీలో కొనసాగేలా ఉన్నప్పుడే ప్రజాతీర్పును గౌరవించినట్లు అవుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి ఎన్నో చట్టాలు చేసినా, చట్టానికి సవరణలు చేసినా అడ్డుకట్ట వేయడం సాధ్యం కావడం లేదంటే లోపం ఎక్కడో కాదు చేసిన చట్టాల్లోనే అని స్పష్టమవుతున్నది. చట్టాలు కావాల్సిన వారికి చుట్టాలేనన్న సామెత ఉండనే ఉంది. చట్టాలు చేసేప్పుడే ఏదో ఒక దొడ్డిదారి ఉండనే ఉంటుంది.
ఎందుకంటే భవిష్యత్తులో మనకూ ఆ దారి ఉపయోగపడుతుందేమోనన్న భావన కావచ్చు. 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం ఒకటింట మూడో వంతు మంది ఎంఎల్‌ఎలు లేదా ఎంపిలు పార్టీ మారేందుకు అవకాశం ఉండడంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (10వ షెడ్యూలు) దుర్వినియోగం అవుతున్నదని భావించి, వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు చట్ట సవరణ చేశారు. దీంతో చట్టసభకు ఎన్నికైన వారు రెండింట మూడో వంతు మంది పార్టీ మారేందుకు అవకాశం ఉంది. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎపై స్పీకర్‌కు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా పిటిషన్ దాఖలైతే వారం రోజుల్లోగా సదరు ఎంఎల్‌ఎకు నోటీసు జారీ చేయాలన్న నియమం ఉంది కానీ నిర్ణయం ఎన్ని రోజుల్లో తీసుకోవాలన్న గడువు ఏమీ లేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఫిరాయింపుల గురించి పక్కన పెడదాం. తెలంగాణలో తాజాగా జరిగిన ఫిరాయింపుల పర్వం గురించే చూద్దాం. బిఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరినందున, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు (శాసన సభ్యత్వాల రద్దు) వేయాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి వివేకానంద జనవరి 15న సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎంఎల్‌ఎలు పరిగి (పోచారం) శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టి. ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ తమ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రభృతులు ‘రిట్’ దాఖలు చేశారు.
దీనిపై న్యాయస్థానంలో ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదుల వాదోపవాదాలు ముగిసాక సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి తాజాగా వెల్లడించింది. ఈ ఫిరాయింపులపై ౩ నెలల్లోగా తేల్చాలంటూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జి మసెహ్‌లతో కూడిన ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశించింది. ఫిరాయింపులు జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నదని, దీనిని నిలువరించలేకపోతే ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎంఎల్‌ఎలకు సంబంధించి స్పీకర్‌కు, ఎంఎల్‌సిలకు సంబంధించి చైర్మన్‌కు ట్రిబ్యునల్ న్యాయ అధికారాలు ఉంటాయి కాబట్టి వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి 15న సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎంఎల్‌ఎలపై కేసు నమోదు కాగానే మర్నాడే స్పీకర్ ఆ ఎంఎల్‌ఎలకు నోటీసులు పంపించిన విషయాన్ని ధర్మాసనం ఉటంకించింది.
ఫిబ్రవరి 3న కేసు విచారణకు స్వీకరించగానే మర్నాడే మిగతా ఫిరాయింపు ఎంఎల్‌ఎలకు నోటీసులు జారీ చేయడాన్ని కోర్టు గుర్తు చేసింది. జనవరి 31న కేసు విచారణ ప్రారంభమైనప్పుడే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు ఎంత గడువు కావాలని ధర్మాసనం కౌంటర్ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది. రెండు రోజుల క్రితం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకుం సమస్యే ఉండదు. అయితే స్పీకర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉన్నా దానిపై సమీక్షించే అధికారం న్యాయస్థానానికి ఉంటుంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మూడు నెలల తర్వాత పిటిషనర్లు కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. చట్టసభకు, న్యాయస్థానానికి మధ్య వివాదం తలెత్తకుండా సాఫీగా సాగాలని ఆశిద్దాం.
- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి
98499 98086