Thursday, July 17, 2025

న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలి: బిజెపి చీఫ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపునిచ్చారు. న్యాయం కోసం ఏ విధంగా పని చేస్తున్నారో అదే విధంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. రామచందర్ రావు గతంలో న్యాయవాది వృత్తిలో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి బిజెపిలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఆయనను సన్మానించింది.

ఈ సందర్భంగా రామచందర్ రావు ప్రసంగిస్తూ తానూ మీలాగే న్యాయవాదిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలందిస్తున్నానని చెప్పారు. ఒకసారి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యానని ఆయన తెలిపారు. అయితే ఎన్నికల్లో ఓడినా, గెలిచినా తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తున్నానని, ధర్మమార్గాన పయనిస్తున్నానని ఆయన చెప్పారు. ప్రజలకు సేవలందించడానికి న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ, లోక్‌సభలో సుమారు 250 మంది న్యాయవాదులు ఎంపీలుగా ఉన్నారని ఆయన తెలిపారు.

అరుణ్ జైట్లీ, కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి వంటి ప్రముఖ న్యాయవాదులు వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా కోర్టుల్లో కలిసి పని చేశారని ఆయన గర్తు చేశారు. రాజకీయాల్లో విలువలు నశిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులను ప్రజలు అసహ్యించుకునే రోజులు వస్తున్నాయని ఆయన ఆవేదన చెందారు. అసెంబ్లీలో వాడుతున్న పదజాలం, బూతులను ప్రజలు వినలేకపోతున్నారని, అసెంబ్లీ సమావేశాలను చూడాలంటే ప్రజలు భయపడుతున్నారని ఆయన తెలిపారు. కాబట్టి యువ న్యాయవాదులు రాజకీయాల్లోకి వచ్చి అంకితమైన భావంతో ప్రజలకు సేవలందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, విలువలు పెంచాలని రామచందర్ రావు కోరారు. ఈ సందర్భంగా రామచందర్ రావును న్యాయవాదులు పార్టీలకు అతీతంగా ఘనంగా సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News