Tuesday, July 29, 2025

మంచిరేవులలో కనిపించి..ఇబ్రహీంబాగ్‌లో ప్రత్యక్షం

- Advertisement -
- Advertisement -

నగర శివార్లలోని గండిపేట్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు గతవారం రోజులుగా చుక్కలు చూపిస్తున్న చిరుత గోల్కొండ ఆర్మీ పరిధిలోని ఇబ్రహీంబాగ్‌లో ప్రత్యక్షమయ్యింది. లంగర్‌హౌజ్‌నార్సింగి ప్రధాన రహదారిలో ఆర్మీ సెంటర్ సమీపంలో ఆదివారం రాత్రి చిరుతపులి రోడ్డు దాటుతుండగా గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించగా, సిసి కెమెరాలను పరిశీలించి నిర్థారణ చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలప్రజలను అప్రమత్తం చేశారు. గతవారం రోజులక్రితం మంచిరేవులలో ఓ కొండపై చిరుతపులి కూర్చోగా,సమీపంలోని ఓ విల్లా వాసులు గమనించి ఫోటోలు తీసి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు గ్రేహౌండ్స్ సమీపంలో 4 బోన్‌లు, సిసి కెమెరాలను ఏర్పాటుచేశారు.

వారంరోజులుగా పరిసర ప్రాంతాల్లో వెదికినా చిరుతపులి ఆచూకి లభించలేదు. అయితే, ఆదివారం రాత్రి ఇబ్రహీంబాగ్ సమీపంలో ప్రధాన రోడ్డు దాటుతుండగా ప్రయాణికుల కంటబడింది. దీంతో స్థానికప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంచిరేవుల, బైరాగిగూడ, నార్సింగి,ఇబ్రహీంబాగ్ పరిసర ప్రాంతాల్లోనే చిరుతపులి సంచరిస్తున్నట్లుగా అటవీశాఖ అధికారులు వలవేసి పట్టుకునేందుకు మరిన్ని బోన్‌లు ఏర్పాటుచేస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు,అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుతపులి సంచారం మంచిరేవుల,నార్సింగి వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మంచిరేవుల సమీపంలో ఉన్న పార్కుసైతం తాళం వేశారు. ఔటర్ సర్వీసు రోడ్డుపై ప్రయాణించాలంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News