ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎల్‌ఐసి) అరుదైన ఘనతను సంపాదించింది.24 గంటల్లో రికార్డు స్థాయిలో బీమా పాలసీలను విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.ఈ ఏడాది జనవరి 20న ఈ ఘనతను సాధించినట్లు ఎల్‌ఐసి ఒక ప్రకటనలో తెలియజేసింది. విస్తృతమైన ఏజెన్సీ నెట్‌వర్క్ కలిగిన తమ పనితీరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తించిందని ఎల్‌ఐసి పేర్కొంది. దేశవ్యాప్తంగా 4,52,839 మంది ఏజంట్లు ఈ ఏడాది జనవరి 20న5,88,107 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను జారీ చేసినట్లు ఎల్‌ఐసి తెలిపింది.
బీమా చరిత్రలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో పాలసీలను జారీ చేయడం ఇదే మొదటిసారి. తమ ఏజంట్లు తమదైన పనితీరుతో ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించారని ఎల్‌ఐసి తెలిపింది. తమ ఏజంట్ల అవిశ్రాంత కృషి,అంకితభావానికి ఇది నిదర్శనమని కొనియాడింది, ఎల్‌ఐసి కస్టమర్లు, వారి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించాలనే లక్షానికి నిబద్ధతగా నిలిస్తుందని తెలిపింది. ఎల్‌ఐసి వ్యవస్థాపక దినోత్సవమైన జనవరి 20న ‘ మ్యాడ్ మిలియన్ డే’ను పురస్కరించుకొని ఒక్కో ఏజంట్ కనీసం ఒక్క పాలసీ అయినా పూర్తి చేయాలని ఎల్‌ఐసి ఎండి, సిఇఓ సిద్ధార్థ మొహంతి విజ్ఞప్తి మేరకు ఈ అరుదైన ఫీట్‌ను ఎల్‌ఐసి సొంతం చేసుకుంది.