మహిళల్లో ఉండే పేదరికం నిర్మూలించేందుకు సెర్ప్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని మంత్రి సీతక్క అన్నారు. మహిళా సంఘాలకు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించామని, వారి వడ్డీలను కూడా బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. మహిళా సంఘ సభ్యురాళ్లకి రూ.10 లక్షల ప్రమాద బీమా, రెండు లక్షల రుణ బీమా కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘం అంటే కేవలం ఆర్థిక స్వావలంబనే కాదని,
అది మహిళల్లో సామాజిక భద్రతను, మానసిక ధైర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. అన్ని విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి, అదనపు డిజి మహేష్ భగవత్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకు ముందు మానవ అక్రమ రవాణాపై పోరాడుతున్న ప్రముఖులను మంత్రి సన్మానించారు.