Friday, July 18, 2025

స్థానిక సమరానికి సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

స్థానిక ఎన్నికలకు శరవేగంగా ప్రభుత్వం అడుగులు
ఎన్నికలకు అవసరమైన మెటీరియల్ సిద్ధం చేయండి
కలెక్టర్లు, జెడ్పి సీఇఓలు, డిపిఓలకు పిఆర్ డైరక్టర్ ఆదేశం
566 ఎంపిపిలు, జడ్పీటీసీలు, 5773 ఎంపీటీసీ స్థానాలు
గ్రామ పంచాయతీల సంఖ్య- 12,778, వార్డుల సంఖ్య- 1,12,694
అధిక స్థానాలు నల్గొండ, అతి తక్కువ స్థానాలు ములుగు జిల్లాలో
అధికారికంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఒక వైపు 42 శాతం రిజర్వేషన్లు బిసిలకు కల్పించే ఉద్దేశ్యంతో గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా పంపిన ప్రభుత్వం అక్కడి నుంచి ఆమోదం రాగానే ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక జివో జారీ చేసే యోచనలో ఉంది. మరో వైపు గ్రామ పంచాయతీ, ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలను నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరక్టర్ డా.సృజన బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సిఇఓలు, డిపిఓలకు సర్కులర్ జారీ చేశారు. ఎన్నికలకు కావాల్సిన మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలని ఆ సర్కులర్‌లో స్పష్టం చేశారు.

ఇప్పుడు ఉన్న మెటీరియల్ ఏవిధంగా పని చేస్తుంది, కొత్తగా సేకరించాల్సిన ఎన్నికల మెటీరియల్ ఏమి కావాలనే అంశాలను నిర్ధారించుకుని ఏర్పాటు చేసుకోవాలని ఆయా అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలతో అధికారులకు పంచాయతీ రాజ్ శాఖ ఈ సూచనలు చేసింది. అలాగే రాష్ట్రంలో ఉన్న జెడ్పిటిసి, ఎంపీటీసీల స్థానాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 566 ఎంపిపిలు, జడ్పీటీసీలు, 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని, వాటికి ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. గతంలో కంటే ఈ సారి ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. రాష్ట్రంలో 71 గ్రామ పంచాయతీలు జీహెచ్‌ఎంసీ, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కలవడంతో ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. గత లెక్కల ప్రకారం ప్రస్తుతం 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 570 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన ఈ నెల 7న ఎంపీటీసీ డీలిమిటేషన్ షెడ్యూల్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతరం 8న ముసాయిదా ప్రచురించి, 8, 9 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించారు. ఈ నెల 10, 11 తేదీల్లో అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత తుది జాబితాను ప్రకటించాలని కలెక్టర్లు, ఎన్నికల అధికారులను డైరక్టర్ ఆదేశించారు. దీంతో అధికారికంగా లెక్కలు నిర్ధారించిన ప్రభుత్వం ఆయా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు వివరాలను పంపించింది. దీంతో ఇక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తును ప్రభుత్వం పూర్తిస్థాయిలో చేపట్టేందుకు సమాయత్తం అవుతోంది. ఇక రిజర్వేషన్ల అంశంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్ధారణకు వస్తే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారిక సమాచారం ఇవ్వడం ద్వారా ఎన్నికల నోటిఫికేషన్‌కి ముహుర్తం దగ్గర పడుతుందని చెబుతున్నారు. ఇదిలావుంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలు కాకుండా ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపిస్తోందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయమై మంత్రులు సైతం ంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలు ముందు జరుగుతాయని సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం నల్గొండ జిల్లాలో అధికంగా 33 జడ్పీటిసి, ఎంపిపి, 353 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. అతి తక్కువ స్థానాలు ములుగు జిల్లాలో 10 ఎంపిపి, జడ్పీటిసి, 83 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి.

గ్రామ పంచాయతీల సంఖ్య-12,778, వార్డుల సంఖ్య-1,12,694
అలాగే రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలు, వార్డుల సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య- 12,778, వార్డుల సంఖ్య- 1,12,694గా లెక్క తేల్చింది. గత ఎన్నికల నాటికి గ్రామపంచాయతీలు 12,848 ఉన్నాయి. కొన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు పురపాలక, నగర పాలక సంస్థల్లో విలీనం కావడం వల్ల పంచాయతీల సంఖ్య తగ్గిందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే పంచాయతీ ఎన్నికలు 2019లో జరిగాయి. ఏడాదిన్నర నిరీక్షణ తర్వాత తిరిగి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగబోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News