లండన్: బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్ద వలస వ్యతిరేకవాదుల భారీ ప్రదర్శన శనివారం సెంట్రల్ లండన్ లో జరిగింది. వలస వ్యతిరేక కార్యకర్త టామీ రాబిన్సన్ నాయకత్వంలో “యునైట్ ది కింగ్ డమ్” పేరుతో లక్షన్నరమందికి పైగా నిరసన కారులు వలసవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ప్రదర్శనల సమయంలో అనేకమంది అధికారులపై దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వారిని పంపివేయండి, మాదేశాన్ని మాకు మళ్లీ ఇవ్వండి, ఇంగ్లీషు చాలు, మా పిల్లల భవిష్యత్ కాపాడండి అని వారు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సెంట్రల్ లండన్ లోని కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ రోడ్లు నిరసనకారులతో నిండిపోయినట్లు విమానాల ద్వారా తీసిన చిత్రాలు చూపుతున్నాయి. అధికారులు నిరసనలను తగ్గించి చూపి ఉండవచ్చునని అంటున్నారు. ఉధృతంగా సాగుతున్న వలస వ్యతిరేక ఉద్యమ నాయకుడు టామీ రాబిన్సన్ లక్షలాదిమంది ఈ ఉద్యమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు.
ఇది సాధారణ నిరసన మాదిరిగా చిత్రీకరించేందుకు అధికారులు ప్రయత్నించడాన్ని ఆయన ఖండించారు. ఒకపక్క టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్ డమ్ మార్చ్ జరుగుతున్న సమయంలోనే కొద్ది దూరంలో జాత్యహంకార వ్యతిరేకంగా, ‘స్టేడ్ అప్ టు రేసిజం’ పేరుతో మరో నిరసన కార్యక్రమం జరిగింది. దీనికి దాదాపు ఐదు వేలమంది హాజరయ్యారు. ఒకే సమయంలో ఈ రెండు ఉద్యమాలకు చెందిన నిరసనకారులు ఎదురెదురు పడకుండా, ఎలాం టి ఘర్షణ చెలరేగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. పరస్పర వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న సమయంలో పోలీసులు అదనపు బలగాలను తరలించారు. రెండు నిరసనల మధ్య ఘర్షణ తలెత్తకుంటా పోలీసులు ఆ ప్రాంతాలలోకి యునైట్ ది కింగ్ డమ్ ప్రదర్శనకారులు ప్రవేశించకుండా ఆపడానికి రోజంతా మెట్రోపాలిటన్ పోలీసులు ఎన్నో సార్లు జోక్యం చేసుకోవల్సివచ్చింది. కానీ, అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. యునైట్ ది కింగ్ డమ్ పేరుతో వలసవాదులకు వ్యతిరేకంగా ప్రదర్శన జరిపిన వారు యూనియన్ జెండా, ఎరుపు, తెలుపు సెయింట్ జార్జ్ క్రాస్ రెండింటినీ ప్రదర్శించారు. కొందరు, అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కూడా ప్రదర్శించారు.
Also Read: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం