ఎంత ఖరీదైన వజ్రాల హారమైనా
ధరించినపుడు, దాని బరువు మాత్రమే తెలుస్తుంది
పగిలిన ముక్కలో నైనా సరే
అద్దంలో చూసుకుంటేనే దాని
అందం కనిపిస్తుంది
నా కళ్లల్లో చూడు
ఎవరెవరో రాళ్లను సాన పడుతున్నారు
నీవు నమ్మినా నమ్మక పోయినా
నాకు బాధలను మోసే అలవాటుంది
నన్ను నేను తప్ప మరెవరూ సంభాళించ లేరు
చాలా సార్లు, నాతో నేనే ఓడిపోతాను
ఈ వెల్తురు, తూర్పుదో, పడమరదో
రాత్రంతా దారి కోసం తిరుగుతూనే వుంది
నీవు ఈ రాత్రి నిద్రపోకుండా జాగారం చేస్తే
ఆరిపోయిన చందమామ వెలగదు
పుండు వేరు, గాయం వేరు, దెబ్బ వేరు
మచ్చలు కూడా సలుపుతాయి
గాట్లు మానిపోయాయో లేదో
చుట్టూ ఎవరూ లేరు, కట్టు విప్పి చూసుకో
మందులతో మానకపోతే, అలా వదిలేయి
ఎవరి ప్రేమనైనా ఉపశమనం యిస్తుందేమో
చూడు
ప్రేమనేది, ఒక్క మనిషి దగ్గరే
దొరుకుతుంది ఇప్పుడు
మనిషి ఎక్కడున్నాడో తెలియడంలేదు
పదండి, పిల్లలం, పెద్దలం కలిసి
వెదకడానికి బయలు దేరుదాం
ఆశారాజు