హైదరాబాద్: తొగుట మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం పడి ప్రజలు ఇబ్బంది పడ్డారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. గత 20 సంవత్సరాలలో సిద్దిపేటలో ఇలాంటి వర్షం ఎప్పుడు పడలేదని అన్నారు. సిద్దిపేట పట్టణం లో కురిసిన వర్షాలకు కోమటి చెరువు నాల వరద ఉదృతికి గురైన ముంపు ప్రాంతాలు శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్ర స్థాయి లో పర్యటించి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను, మున్సిపల్ అధికారులను హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షం వల్ల సిద్దిపేటలో పలు కాలనీలు జలమయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో వచ్చిన వరదను తగ్గించడానికి నర్సాపూర్ చెరువుకు ఒక మీటర్ తొలిగించామని, నర్సాపూర్ చెరువు నీటిని శనిగరం వాగు, మందపల్లి వాగు వైపు నీళ్లు మళ్లించామని తెలియజేశారు. భవిష్యత్తులో వరద వచ్చినపుడు ఎలా చర్యలు చేపట్టాలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు చేయాలని సూచించడం జరిగిందని, ప్రజలు కూడా సహకరించాలని నాలాలు కబ్జాలు చేసి సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు కట్టడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.
నాలాలు కబ్జాలు చేసి ఇల్లు నిర్మించుకున్నాక వరదలు వస్తే బాధపడితే ఎలా? అని లోతట్టు ప్రాంతాలలో తక్కువ ధరకు వస్తున్నాయని ఇల్లు నిర్మాణం విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మించుకోకూడదని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పరవేక్షణ చేయాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందోద్దు అని హరీష్ రావు తెలిపారు.