పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావర కేంద్రం ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండి, ఇది ఎత్తు పెరిగేకొద్ది దక్షిణ దిక్కుకు వాలి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, గురువారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రెండు రోజుల పాటు కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. కాగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లొ కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోన్నారు.