ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని చత్తీస్‌గఢ్‌ల మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. వాయువ్య అరేబియన్ సముద్ర తీర ప్రాంతం నుంచి ఒక ద్రోణి దక్షిణ గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఏర్పడిందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకశం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మాల్, నిజామాబాద్, జగిత్యాల,
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ ఇచ్చింది.
రాయలసీమ, ఉత్తర కోస్తాకు వర్ష సూచన
రాయలసీమ, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని గంగా తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది.
వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడడక్క ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గురువారం పోలవరం, తిరువూరు, అనకాపల్లిలో 5 సెంటిమీటర్లు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, చింతలపూడి, పెద్దాపురం, మాచర్లలో 4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.