Tuesday, August 26, 2025

సెప్టెంబరు 7న చంద్రగ్రహణం

- Advertisement -
- Advertisement -

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. సెప్టెంబరు 7న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ యాత్రను ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. వివరాల్లోకి వెళితే సెప్టెంబరు 7న రాత్రి 9:50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:31 (సెప్టెంబరు 8 ) గంటలకు ముగుస్తుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం, గ్రహణానికి ఆరు గంటల ముందుగా ఆలయ తలుపులను మూసివేస్తారు. తిరిగి సెప్టెంబరు 8న ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరుస్తారు. అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహవచనం, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన వంటి సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

ఆ తర్వాత ఉదయం 6 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. గ్రహణం కారణంగా సెప్టెంబరు 7న నిర్వహించే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి అన్నప్రసాద వితరణను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తారు. తిరిగి సెప్టెంబరు 8వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి అన్నప్రసాద వితరణ యథావిధిగా కొనసాగుతుంది. అన్నప్రసాద వితరణ నిలిచిపోనున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 7వ తేదీ సాయంత్రం నుంచి సుమారు 30,000 పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయం ఎదురుగా ఉన్న వైభోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లతో పాటు శ్రీవారి సేవా సదన్ వద్ద ఈ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయని వారు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News