ముంబయి: కదులుతున్న బస్సులో ఓ యువతి ప్రసవించింది. అనంతరం పసికందును బస్సు కిటికీలో నుంచి బయటకు విసిరేయడంతో బాబు చనిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పర్భాణీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రితిక దీరీ అనే యువతి, అల్తాఫ్ షేక్‌తో కలిసి పూణే నుంచి పర్భాణీకి వెళ్తోంది. సంత్ ప్రయాగ్ ట్రావెల్స్‌లో స్లీపర్ కోచ్‌లో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. పెత్రి-సెలూ రహదారిపై రాగానే రితికకు పురటి నొప్పులు రావడంతో పండంటి మగ బిడ్డకు జన్మనించింది. వెంటనే బాబును గుడ్డలో మూటకట్టి బస్సులో కిటికీలో నుంచి షేక్ బయటపడేశాడు. డ్రైవర్ గమనించి కిటికీలో నుంచి వస్తువు బయటపడడంతో బస్సును నిలిపివేశాడు. డ్రైవర్‌ను వారిని ప్రశ్నించగా తన భార్య రితిక వాంతులు చేసుకోవడంతో గుడ్డతో సహా బయటపడేశానని వివరణ ఇచ్చాడు.
డ్రైవర్‌కు అనుమానం రావడంతో రోడ్డు వెంట పరిశీలించగా పసికందు దేహం కనిపించింది. వెంటనే డ్రైవర్ 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఇద్దరు భార్యభర్తలమని సమాధానం చెప్పారు. దంపతులమని చెప్పడానికి సరైన ఆధారాలు వారి వద్ద లేవు. ఏడాదిన్నర నుంచి పుణేలో కలిసి ఉంటున్నామని పోలీసులకు ఇద్దరు వివరణ ఇచ్చారు. యువతిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద 94(3)(5) కింద కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. పసికందు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.