భారతీయ సినిమా రంగాన్ని పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్న హోంబలే ఫిలిమ్స్ ఇప్పుడు క్లీమ్ ప్రొడక్షన్స్‌తో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసియు) అనే గొప్ప ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ఇది భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని భగవంతుడు విష్ణు దశావతారాలను యానిమేషన్, గొప్ప స్టొరీ టెల్లింగ్‌తో తెరకెక్కనుంది. మహావతార్ యూనివర్స్ 12 సంవత్సరాల ప్లానింగ్ తో ప్రారంభమవుతుంది. ఈ పయనం మొదటి అడుగు మహావతార్ నరసింహ రూపంలో, జూలై 25, 2025న 3డి ఫార్మాట్‌లో, భారతదేశంలోని ఐదు ప్రధాన భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు అశ్విన్ కుమార్, నిర్మాతలు శిల్పా ధవాన్, కుశల్ దేశాయి, చైతన్య దేశాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ వైరల్ గా మారి మేకర్స్ విజన్‌పై అంచనాలను పెంచింది. ఈ యూనివర్స్ దశావతారాలను తెరపైకి తీసుకొస్తుంది.
2025లో నరసింహ, 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్ కల్కి – పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి – పార్ట్ 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తాజాగా ‘మహావతార్ నరసింహ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘రోర్ అఫ్ నరసింహ’ ను విడుదల చేశారు. స్టార్ కంపోజర్ సామ్ సి.ఎస్ ఈ పాటను పవర్‌ఫుల్‌గా కంపోజ్ చేశారు. సామ్ సి.ఎస్, రాకేందు మౌళి పవర్‌ఫుల్ సాహిత్యాన్ని అందించడమే కాక, అంతే ఎనర్జీటిక్‌గా కూడా పాడారు. ఈ సాంగ్ ప్రస్తుతం అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. “భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నంలో, మా క్లీమ్ ప్రొడక్షన్స్, హోంబలే ఫిలమ్స్ కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి”అని అన్నారు.