మనతెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేకప్రతినిధి: ‘సిఎం రేవంత్‌రెడ్డే మ ళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు..’ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే ఎమ్మెల్యేలు కోరుకుంటేనే అని ఆయన చిన్న ట్విస్ట్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. మా జోడి బాగుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వెళతామని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ యన ధీమాగా చెప్పారు. తనకు మంత్రి పదవి ఇస్తామంటే వద్దన్నాన ని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే డి. నాగేందర్ సభ్యత్వం గురించి ప్ర శ్నించగా, నాగేందర్ తన పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నారని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ విచారణ మినహా మరో
మార్గం లేదని ఆయన తెలిపారు. సిబిఐలో కొన్ని లొసుగులు ఉన్నాయని, అయితే సిబిఐ కాకుండా, రాష్ట్ర విచారణ సంస్థతో విచారణ చేయిస్తే ప్రతిపక్షంపై కక్ష కట్టారని తమను బద్నాం చేస్తారని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. సిబిఐ నిష్షక్షపాతంగా వ్యవహారిస్తుందని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. ఇంత కాలం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించిన బిజెపి నాయకులు, కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండ్ సంజయ్ చొరవ తీసుకుని త్వరితగతిన విచారణ పూర్తయి నివేదిక వచ్చేలా చూడాలని ఆయన సూచించారు.
కెసిఆర్ కుటుంబం డ్రామా
కాళేశ్వరం కమిషన్ నివేదికపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు కెసిఆర్ కుటుంబం నాటకం చేస్తున్నదన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజలను నమ్మించే అలవాటు మొదటి నుంచీ కెసిఆర్ కుటుంబానికి ఉందన్నారు. మాజీ మంత్రి టి. హరీష్ రావు, మాజీ ఎంపి సంతోష్ కుమార్ ఎలా దోచుకున్నారో కవిత చెప్పి మంచి పని చేశారని అన్నారు. కవితను తమ పార్టీలో చేర్చుకోబోమని ఆయన తెలిపారు. పార్టీ అధిష్టానం సంకేతాలతోనే తాను చెబుతున్నానని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా గవర్నర్‌ను కోరామని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం తమ పార్టీ మూల సిద్ధాంతమని అన్నారు. నాకు కులమంటే అభిమానమే కానీ కుల పిచ్చి లేదన్నారు. బిసి డిక్లరేషన్ ప్రకటించిన తనకే పిసిసి చీఫ్‌గా బాధ్యత రావడం సంతోషంగా ఉందని, అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. గాంధీ భవన్‌లో మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టిన తనకు మంచి పేరు వచ్చిందన్నారు. ఏఐసిసి నాయకురాలు మీనాక్షి నటరాజన్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా రావడం సంతోషకరమని అన్నారు. తాము చేపట్టిన పాదయాత్రకూ మంచి స్పందన వస్తున్నదని ఆయన వివరించారు.
క్రమశిక్షణ విషయంలో కఠినం..
పార్టీ క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహారిస్తున్నామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, కోమటిరెడ్డి బ్రదర్స్ నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారని ఆయన అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కొంత అయోమయం ఉందని, అంతా సర్దుకుంటుందని ఆశిస్తున్నాని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో బ్రేకులే కాకుండా సడెన్ బ్రేకులు కూడా ఉంటాయని ఆయన నవ్వుతూ అన్నారు.
పదవుల భర్తీ వేగవంతం..
వారం, పది రోజుల్లో పార్టీ జిల్లా కమిటీల ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పలు కార్పోరేషన్ల చైర్మన్ల పదవులను వచ్చే నెల భర్తీ చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కార్పోరేషన్ల పదవులను భర్తీ చేస్తామన్నారు. వచ్చే నెలలో సభ్యత్వ నమోదు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.