బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబంలో మూడు ముక్కలాట చివరి దశకు చేరిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కెసిఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని రుజువైందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కెసిఆర్ తప్పు చేశారా ? లేక హరీష్ రావు చేశారా? అనేది తమకు అనవసరమని, వారి హయాంలో అవినీతి జరిగిందనేది కవిత స్పష్టం చేశారని ఆయన తెలిపారు. కుటుంబ కలహాలను తమపై రుద్దడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
బిఆర్‌ఎస్ అవినీతిని ఎండ గట్టడమే తమ లక్షం తప్ప కుటుంబ తగాదాలతో సంబంధం లేదని ఆయన వివరించారు. తాము తప్పు చేయలేదని అంటున్న బిఆర్‌ఎస్ నాయకులు సిబిఐ విచారణ అనగానే ఎందుకు జంకుతున్నారని ఆయన ప్రశ్నించారు. తప్పు చేయకపోతే విచారణను స్వాగతించాలని ఆయన తెలిపారు. మొదటి దఫా ప్రభుత్వంలో హరీష్ రావు తప్పు చేస్తే కెసిఆర్ ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ చుట్టూర దెయ్యాలు ఉన్నాయన్న కవిత ఇప్పుడు ఆ దెయ్యాలు హరీష్ రావు, సంతోష్‌లేనా? అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.