మనతెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి: ఓట్లను మార్ఫింగ్ చేసి బిజేపి మూడో సారి అధికారంలోకి వచ్చిందని టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తూ సూర్యాపేటలో ఆగిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిజేపి ఆర్ఎస్ఎస్ సానుకూలంగా ఉన్న వ్యక్తులకు నాలుగు నాలుగు రాష్ట్రాల్లో ఓట్లు ఉండడం, సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో 45ఓట్లు నమోదవ్వడం 3వ సారి తక్కువ మెజార్టీతో గెలిచినప్పుడు అధికారంలోకి రావడానికి మోడీ, అమిత్ షా కలసి ఈ తీవ్రమైనటువంటి నేరానికి పాల్పడ్డారని అన్నారు. రుజువులతో సహా రాహుల్ గాంధీ నిరూపించాడని గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదని, ఓట్లని తన వైపు తిప్పుకోవడానికి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు. అధికారమే పరమావధిగా మోడీ, అమిత్ షాలు పాల్పడ్డారని, ప్రజలు, పౌరులు తీవ్రంగా ఖండించాలన్నారు.
ఓట్ల దొంగలింపుకు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని, మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ దేశానికి ఎటువంటి కార్యక్రమాలు గాని చేయలేదని, శ్రీరాముని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు ఇది మంచి కాదని అన్నారు. వచ్చే తరానికి దేవుళ్ల పేరు మీద మతాల పేరు మీద వచ్చే తరానికి విఘాతం కలిగిస్తుందన్నారు. క్వాలిటీ ఉన్న నాయకుల్ని ఎన్నుకోవాలని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందన్నారు. సన్న బియ్యం అనేది ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమమని, 10 సంవత్సరాలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రజా పాలనలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 45లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, ఇందిరమ్మ ఇళ్లు అనేది ప్రతి పేద వాడి కల అని, తప్పకుండా అర్హులందరికీ ఇందరమ్మ ఇండ్లు అందజేస్తామని అన్నారు. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు. వారి వెంట డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.