మద్యం కుంభకోణంతో జైలులో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బిసి రిజర్వేషన్ల కోసం ఎప్పుడు ఉద్యమం చేశారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్ల కోసం తాను ఉద్యమించినందునే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కోసం సిద్దమైందని కవిత చెబుతూ తీన్మార్ డాన్సులు చేస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణంతో తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందని ఆయన శనివారం పార్టీ ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మల్లు రవితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. బిసి రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీ మాట తప్పదు, మడమ తిప్పదు అని ఆయన తెలిపారు.
బిసిల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపడితే బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కనీసం హర్షం వ్యక్తం చేయలేదని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బిసిల రిజర్వేషన్లు ౩౩ నుంచి 27 శాతానికి తగ్గాయని ఆయన విమర్శించారు. బిసిల పట్ల బిఆర్‌ఎస్‌కు ఎందుకు అంత అక్కసు అని ఆయన ప్రశ్నించారు. కడుపు నిండా విషం నింపుకున్న బిఆర్‌ఎస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, దీనిని బిసిలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు.
దెయ్యాలు ఏమయ్యాయి..?
బిఆర్‌ఎస్‌లో దెయ్యాలు ఉన్నాయని కవిత లోగడ చేసిన ఆరోపణను మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తావిస్తూ ఇప్పుడు ఆ దెయ్యాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే బిసిని సిఎం చేస్తామన్న బిజెపి కనీసం అధ్యక్షున్ని అయినా నియమించలేదని ఆయన విమర్శించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ మార్క్ అని ఆయన తెలిపారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కామారెడ్డిలో బిసి డిక్లరేషన్ ప్రకటించానని, ఇప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు బిసి రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌కు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.