పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవినీతిలో భాగస్వామ్యమైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పుడు నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందంటున్న కవిత అప్పుడే రాజీనామా చేసి ఉంటే ప్రజలు సంతోషించే వారని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. పదేళ్ళూ దోచుకుని, దాచుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. అంతకు ముందు కవిత విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, తాము ప్రజల వెంట ఉన్నామే తప్ప అవినీతిపరుల వెంట ఎందుకు ఉంటామని ఎదురు ప్రశ్నించారు. కవితి కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అబద్దాలు చెప్పారని ఆయన తెలిపారు. మాజీ మంత్రి టి. హరీష్ రావు, మాజీ ఎంపి సంతోష్ కుమార్ వెనక ఉండాల్సిన ఖర్మ తమకు లేదన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై అభాండాలు వేయడం భావ్యం కాదన్నారు. కవిత అమెరికా వెళ్ళి రాగానే తన విధానాన్ని ఎందుకు మార్చారని, గతంలో అన్న కెటిఆర్‌పై ఎక్కుపెట్టిన బాణం దిశ మార్చి బావ హరీష్ రావుపై మార్చడంలోని అంతరార్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
అక్రమంగా దోచుకున్న దాంట్లో వాటాల పంపకాల్లో తేడాలు రావడంతోనే కెసిఆర్ కుటుంబంలో వివాదం తలెత్తిందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ కుటుంబం తీసుకునే తుది నిర్ణయాల్లో కవిత కూడా ఒకరని అన్నారు. కెసిఆర్ కుటుంబం కొత్త డ్రామా చేస్తున్నదని, కవిత కెసిఆర్ విడిచిన బాణం అనే సందేహం తమకు ఉందని ఆయన తెలిపారు. కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం శుభపరిణామమే అయినప్పటికీ, అవినీతి జరుగుతున్నప్పుడే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి ఉంటే ప్రజలు సంతోషించే వాళ్ళని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బిఆర్‌ఎస్ కనుమరుగు అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కెసిఆర్ కుటుంబం కొత్త నాటకానికి తెర లేపిందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.