ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో గందరగోళం నెలకొంది. లోక్ సభ, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇండియా కూటమి, విపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చించాలని పట్టుబట్టాయి. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఎంపి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని జమ్మూ గవర్నర్ చెప్పారన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినవాళ్లు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. భారత ఫైటర్ జెట్ల కూల్చివేతపై సమాధానం ఇవ్వాలని.. సీజ్ఫైర్కు కారణమెవరని నిలదీశారు. నేనే యుద్ధం ఆపానంటూ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ 20 సార్లు చెప్పుకున్నారని.. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు.
ఇక, లోక్ సభలోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ సిందూర్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాల సభ్యులు.. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నిరసనకు దిగారు. దీంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకి స్పీకర్ వాయిదా వేశారు.