ఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయ్యాయని ఎఐసిసి మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తెలిపారు. తమరు ప్రభుత్వ రంగ కార్ఖానాలు కాదు.. అబద్ధపు కార్ఖానాలు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ పై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కీలకమైన అంశంపై పార్లమెంటు లో చర్చ జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోడీ సభలో లేరని, కీలకమైన చర్చను వదిలేసి బిహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిందని తెలియజేశారు. పార్లమెంటుకు రాకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లడమే దేశభక్తి అవుతుందా? అని ప్రశ్నించారు.
పహల్గాం దాడి (Pahalgam attack) తర్వాత పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని అడిగితే మోడీ స్పందించలేదని, ఘటన జరిగిన 3 నెలల తర్వాత పార్లమెంటులో చర్చ పెట్టారని మండిపడ్డారు. విపక్షాలు పాకిస్థాన్ కు మద్దతు ఇస్తున్నాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అసత్యాలతో ఎక్కువకాలం ప్రజలను మభ్య పెట్టలేరని అన్నారు. తాము ఎప్పుడూ పాకిస్థాన్ కు మద్దతు ఇవ్వలేదని, ఇవ్వబోము అని చెప్పారు. కాంగ్రెస్ దేశాన్ని నిర్మించిన పార్టీ.. కాంగ్రెస్ కు చాలా చరిత్ర ఉందని కొనియాడారు. పహల్గాం ఘటనతో సంబంధం లేని అంశాలను లేవనెత్తుతున్నారని, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని ధ్వజమెత్తారు. తాము మొదట నుంచి చెబుతున్నామని, ఉగ్రవాద సమస్య బిజెపి హయాంలో మూడింతలు అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉగ్రవాదాల మూలాలు దెబ్బతీస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటనలో చెప్పారని అన్నారు. పాక్ ఉగ్రవాదులు పహల్గాం వరకు ఎలా వచ్చారని, పహల్గాం దాడికి 3 రోజుల ముందు ప్రధాని జమ్మూ పర్యటన రద్దు చేసుకున్నారని ఎద్దేవ చేశారు. ప్రధాని పర్యటన రద్దు చేసుకుంటారని.. పర్యాటకులను ఎలా అనుమతించారని నిలదీశారు. పహల్గాం దాడి కచ్చితంగా భద్రతా వైఫల్యమని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అన్నీ తన ఘనతగా చెప్పుకునే జవాబుదారీ మోడీ.. పహల్గాం ఘటనకు ఎందుకు బాధ్యత వహించరు? అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సైనికులు సాధించిన విజయాన్ని కూడా రాజకీయం చేయడం తగదని.. ఆపరేషన్ సిందూర్ లో భారత విజయంపై కాంగ్రెస్ కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిందని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.