పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తమ తీవ్రస్థాయి భాషోద్యమం ఆరంభించారు. కేంద్ర ప్రభుత్వం భాషా దురహంకార వాదానికి దిగుతోందని దీనిని తాను సహించేది లేదని సివంగిలా గర్జించారు. సోమవారం ఆమె బీర్బూమ్ జిల్లాలోని బోల్పూరు లో భాషా ఆందోళన్ చేపట్టారు. కేంద్రం హీందియేతర రాష్ట్రాలు ప్రాంతాల్లో భాషాపరమైన ఉగ్రవాదానికి దిగిందని ఆరోపించారు. తాను అవసరం అయితే తన ప్రాణాలు ఇస్తాను కానీ , తన బెంగాలీ భాషను ఎవరూ హరింపచేయనివ్వబోనని స్పష్టం చేశారు. బెంగాల్‌లో బెంగాలీ మాట్లాడే వలసదార్లను ఓటర్ల జాబితా నుంచి తీసివేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఇక్కడ దొడ్డిదారిలో ఎన్‌ఆర్‌సిని పలు సాకులతో అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇదంతా కూడా బెంగాళీ భాషపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలో భాగం అని మండిపడ్డారు.
సక్రమ ఓటర్లను అక్రమ పద్ధతుల ద్వారా తీసివేస్తే సహించేది లేదని, బెంగాళీ భాష పరిరక్షణకు తాను ప్రాణత్యాగం అయినా చేస్తానని తెలిపారు. ఇక్కడ టిఎంసి కార్యకర్తల నుద్ధేశించి మమత ఉద్రేక ఉద్విగ్నభనిత ప్రసంగం చేశారు. కేంద్రం రాష్ట్రంలో నిర్బంధ అణచివేతల శిబిరాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. భాషను, ప్రాంతీయ ఉనికిని దెబ్బతీసేందుకు పావులు కదుపుతోంది. దీనిని చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇసి ఇటీవలి కాలంలో బిజెపి పాట పాడుతోంది. కేంద్రం లేదా బిజెపి ఏజెంట్‌గా మారింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణల పేరిట నిజమైన ఓటర్లను తొలిగించడం దారుణం అని , ఇక్కడ ఇటువంటి చేష్టలకు తావు లేదని స్పష్టం చేశారు.