మనతెలంగాణ, సిటిబ్యూరోః నిషేధిత దగ్గు టానిక్‌ను విక్రయిస్తున్న వ్యక్తిని రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది సరూర్‌నగర్, కొత్తపేటలో గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 102 టానిక్ బాటిళ్లను స్వాధీనం చేసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…కొత్తపేటకు చెందిన మూసం లక్ష్మణ్ ప్రభుత్వం నిషేధించిన కోడిన్ పాస్పెట్ టానిక్‌ను నిషేధించింది. మత్తుకు అలవాటు పడిన పలువురు రూ.190లకు మత్తు వచ్చే కోడిన్ పాస్పెట్‌ను కొనుగోలు చేస్తున్నారు.
గంజాయి, డ్రగ్స్‌కు ఖరీదు ఎక్కువ కావడంతో చాలామంది మత్తుకు అలవాటుపడిన వారు ఈ దగ్గు టానిక్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో లక్ష్మణ్ మరో వ్యక్తి కలిసి టానిక్‌ను కొందరు అక్రమంగా తయారు చేస్తుండగా వీరు కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి రూ. 350కి విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ సిబ్బంది నిందితులపై నిఘా పెట్టారు. సిఐ బాలరాజు, ఎస్సై రవి, సిబ్బంది కలిసి టానిక్ బాటిళ్లను తరలిస్తున్న లక్ష్మణ్‌ను పట్టుకున్నారు. ఈ దగ్గు టానిక్‌ను డాక్టర్ సిఫార్సు చేస్తేనే విక్రయించాలని, కాని నిందితులు యథేచ్చగా విక్రయిస్తున్నారు. టానిక్ విక్రయిస్తున్న మెడికల్ షాపుపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిఐ బాలరాజు డ్రగ్స్ కంట్రోలర్‌కు కోరినట్లు సిబ్బంది చెప్పారు.