Thursday, August 14, 2025

బైక్‌పై చెట్టుకూలి ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తెల్లవారు జామున ఎడతెరిపి లేని కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ వర్షబీభత్సానికి కల్కాజీ ప్రాంతంలో ఓ బైక్‌పై భారీ చెట్టు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సమీపం లోని మరో వాహనం కూడా దెబ్బతింది.లజ్‌పత్ నగర్, రోహ్‌తక్ రోడ్డు, ఆనంద్ పర్బాత్, జహంగిపురి లోని జిటికె డిపో, ఆదర్శనగర్, రింగ్‌రోడ్ సమీపాన పాత జిటి రోడ్డు, మధుర రోడ్డు లోని ఆశ్రమ్ నుంచి మూల్‌చంద్ వరకు ఉన్న క్యారేజి వే, దౌలా కుయాన్ గురుగ్రామ్ రోడ్డు, పూర్తిగా జలమయమయ్యాయి. ఉదయం రద్దీ సమయం కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

లజ్‌పత్‌నగర్ లోని ట్రాఫిక్‌లో ఓ ప్రయాణికుడు చిక్కుకున్నాడు. రోడ్డు జలమయం కావడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవలసి వచ్చిందని చెప్పాడు.దౌలాకుయాన్ గురుగ్రామ్ రోడ్డులో నీటిలో డిటిసి బస్సు ఆగిపోయింది. కార్లు నీటిలో సగం మునుగుతూ వెళ్తుండడం కనిపించింది. మోటారు సైకిళ్లు, స్కూటర్లపై వెళ్లే వారు బలాన్ని ఉపయోగించి నీటిలో వాహనాలను తోసుకుంటూ వెళ్లారు. ఇలాంటి దృశ్యాలే సుబ్రొతో పార్కు,ఔటర్‌రింగ్ రోడ్డు, ద్వారకా సెక్టర్ 20, బసాయి రోడ్డు, ఘజియాబాద్, నొయిడాల్లో కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. ముఖ్యమంత్రి రేఖాగుప్తా నేతృత్వంలో వాటర్ లాగింగ్ విభాగం నీటిని తొలగించే చర్యలు చేపట్టింది. ఢిల్లీ వాతావరణ శాఖ ఆరంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షం రోజంతా కురుస్తుందని అప్రమత్తం చేసింది.

గత 24 గంటల్లో ఢిల్లీ లోని సఫ్దర్‌జంగ్ లోని ప్రాథమిక వాతావరణ కేంద్రంలో 13.1 మిమీ వర్షపాతం నమోదైంది. ఆయా నగర్‌లో 57.4 మిమీ , పాలెంలో 49.4 మిమీ , లోధి రోడ్డులో 12 మి.మీ, ప్రగతి మైదాన్‌లో 9 మి.మీ, పూసాలో 5 మి.మీ, వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ తెలిపింది. వర్షం కారణంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 23.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గినట్టు ఐఎండీ తెలియజేసింది. ఇది సాధారణం కంటే 3.2 డిగ్రీలు తక్కువ. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News