మహబూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్ మండలం, బైరంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తనకు తాగుడు మాన్పించాలని నాటువైద్యం చేయించిన భార్యను గొడ్డలితో నరికి చంపాడు ఓ కసాయి భర్త. మిడ్జిల్ ఎస్‌ఐ శివనాగేశ్వర్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. బైరంపల్లి గ్రామానికి చెందిన బాలమణి (48) మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తుండగా ఆమె భర్త బచ్చయ్య మెడపై గొడ్డలితో నరికి చంపాడు. బచ్చయ్య తాగుడుకు బానిసయ్యాడు. అయితే, ఎలాగైనా తాగుడు మాన్పించాలనే ఉద్దేశంతో బాలమణి భర్తకు నాటువైద్యం చేయించింది. అయితే ఇదే విషయంలో తన భార్యపై కక్ష పెంచుకున్న బచ్చయ్య సోమవారం ఆమెతో గొడవపడి దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న జడ్చర్ల రూరల్ సిఐ నాగార్జున గౌడ్ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. హతురాలి కూతురు మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.