అప్పు ఇచ్చిన 300 రూపాయల నుంచి మరో 100 రూపాయలు రావాల్సి ఉండగా కార్మికుల మధ్య జరిగిన వివాదం ముదిరి తోటి కార్మికుడిని మద్యం మత్తులో ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన సంఘటన బుధవారం రాత్రి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ టౌన్ షిప్‌లో జరిగింది. గోదావరిఖని ఎసిపి మడత రమేష్, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం… ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లో గృహ నిర్మాణ పనుల్లో పని చేస్తున్న వినోద్ బాబూజీ (44) అనే కార్మికుడు సంఘటనలో మృతి చెందాడని తెలిపారు. మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన వినోద్ బాబుజీతో పాటు మనోజ్ దివాకర్, మరో నలుగురు కార్మికులు కలిసి ఒకే షెడ్డులో ఉంటున్నారు. మనోజ్ దివాకర్ అనే కార్మికుడు తోటి కార్మికునికి
300 రూపాయలు కొద్ది రోజుల క్రితం అప్పు ఇవ్వగా 200 రూపాయలు చెల్లించాడని, మరో 100 రూపాయల కోసం బుధవారం రాత్రి తాగిన మత్తులో వివాదం జరిగింది. వినోద్ బాబూజీ పడుకొని ఉండగా, మనోజ్ దివాకర్ ఇనుప రాడ్‌తో కొట్టడంతో నిద్రలోనే స్పృహ తప్పిపోయాడు. గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తోటి కార్మికుడు లేవకపోవడంతో కార్మికులు వచ్చి చూడగా పడిపోయి ఉండటంతో వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయంలో దాడికి పాల్పడిన మనోజ్ దివాకర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.