మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మధ్యప్రదేశ్ హైవేపై ఓ భర్త విషాద భరిత బైక్ ప్రయాణం సాగింది. బైక్‌పై వెళ్లుతుండగా ఈ దారిలోనే అంతకు ముందు తన వెనుక కూర్చున్న భార్యను డియోలాపార్ వద్ద ఓ ట్రక్కు వచ్చి వేగంగా ఢీకొంది. దీనితో ఆమె కింద పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడింది. ఆసుపత్రికి తరలించేందుకు ఏ వాహనం ఆగలేదు. తరువాత ఈ మహిళ చనిపోవడంతో ఇక చేసేది లేక ఈ వ్యక్తి తన భార్య శవాన్ని బైక్‌కు తాడుతో కట్టేసి ఈ హైవే మీదుగానే తన ఇంటికి బయలుదేరాడు. సంబంధిత వీడియో దృశ్యాలు వెలుగులోకి రావడంతో అంతా
ఈ భర్త మానసిక క్షోభ పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 36 సంవత్సరాల ఈ వ్యక్తిని అమిత్ బుమ్రా యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ దంపతులు నాగ్‌పూర్ సమీపంలోని లోనారాలో ఉంటున్నారు. భార్య గ్యాయర్షీయాదవ్ ను తీసుకుని మధ్యప్రదేశ్‌లోని కరణ్‌పూర్‌కు వెళ్లుతుండగా ట్రక్కు ఆమెకు యమపాశం కాగా , ఆయనకు తీరని వ్యధల కూపం మిగిల్చింది. జాతీయ రహదారిపై క్షతగాత్రురాలికి చికిత్స ఏర్పాట్లు లేని వైనం ఇప్పుడు కేంద్ర హైవేల మంత్రి గడ్కరీ ప్రాతినిధ్యం వహించే నాగ్‌పూర్ కేంద్రంగానే వెలుగులోకి వచ్చింది. వేగం గురించి ఆలోచించే అధికారులు మనిషి ప్రాణం పట్ల శ్రద్ధ వహించకపోవడం ఇప్పుడు ప్రశ్నలకు దారితీసింది.