మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకూ రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేయాలని, ప్రభుత్వంపై వత్తిడి తేవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును కోరారు. మంగళవారం మంద కృష్ణ మాదిగ కొంత మంది వికలాంగులతో కలిసి నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు రామచందర్ రావుకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు, మంద కృష్ణ మాదిగ కొంత సేపు చర్చలు జరిపారు. అనంతరం మంద కృష్ణ మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని అన్నారు.
ఈ మేరకు రామచందర్ రావుకు 26 డిమాండ్లతో వినతి పత్రం అందజేసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వికలాంగుల పెన్షన్ ఆరు వేలు, ఇతర ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు, తీవ్ర వైకల్యం ఉన్న వారికి నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసిసి ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు వెంటనే రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వికలాంగులకు ఇంటి స్థలం కేటాయించాలని, ఎన్నికల హామీ ప్రకారం అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.