బెంగళూరు: మంగళూరు విద్యార్థిని ప్రపంచ రికార్డ్ సృష్టించింది. మంగళూరులోని సెయింట్ అలోసియస్ (డీమ్డ్ టు బి యూనివర్సిటీ)లో చివరి సంవత్సరం బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థిని రెమోనా ఎవెట్ పెరీరా.. 170 గంటల పాటు నిరంతరం అద్భుతమైన భరతనాట్యం ప్రదర్శన ఇచ్చింది. దీంతో గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె తన పేరును లిఖించుకుంది. అద్భుతమైన భరతనాట్యం ప్రదర్శనకు రెమోనాపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. పెరీరా జూలై 21న అసాధారణ ప్రదర్శనను ప్రారంభించి జూలై 28న ముగించింది. ఏడు రోజులు.. 170 గంటలు నిద్ర లేకుండా ఆమె ప్రదర్శన ఇచ్చింది. ఆమె అంకితభావం, ఓర్పు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ప్రదర్శన అనంతరం వారు నిలబడి చప్పట్లతో అభినందించారు. కాగా, అంతరాయం లేకుండా ఇంత సుదీర్ఘకాలం భారతీయ శాస్త్రీయ నృత్య రూపాన్ని ప్రదర్శించిన మొదటి వ్యక్తిగా రెమోనా నిలిచింది.
సెయింట్ అలోసియస్ కళాశాలలోని రంగ అధ్యయన కేంద్రం డైరెక్టర్ క్రిస్టోఫర్ డిసౌజా మాట్లాడుతూ.. ప్రదర్శన అంతటా పెరీరాకు 15 నిమిషాల స్వల్ప విరామాలు అనుమతించబడ్డాయని చెప్పారు. ఆమె దృఢ సంకల్పాన్ని ప్రశంసిస్తూ.. “రెమోనా.. నువ్వు, పట్టుదల, ఓర్పుతో మంగళూరును గర్వపడేలా చేశావు. నీ కలను చరిత్రగా మార్చావు. నీ కళాత్మకత, దృఢ సంకల్పంతో ఒక తరమంతా స్ఫూర్తినిచ్చావు” అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు.
మూడేళ్ల వయసులోనే భరతనాట్యం ప్రారంభం
ప్రఖ్యాత గురువు శ్రీవిద్య మురళీధర్ ఆధ్వర్యంలో పెరీరా మూడేళ్ల వయసులో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. ఆమె 2019లో సోలోగా అరంగేట్రం చేసింది. అప్పటి నుండి ప్రసిద్ధి చెందిన ప్రదర్శనకారిణిగా పేరు తెచ్చుకుంది. ఈ రికార్డు ప్రదర్శన కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదని, ప్రపంచ వేదికపై శాస్త్రీయ నృత్య రూపానికి నివాళి అని ఆమె అన్నారు.