Friday, July 4, 2025

ప్రజాస్వామ్యంలో చర్చలకు తావు లేదా?

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశానికి ఒక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కావడంతో ప్రజల భాగస్వామ్యం ప్రతి దశలోను ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు లేకుండా ప్రతిపణాల సలహాలు, సూచనలు పరిగణనలోనికి తీసుకొని ప్రజలను కూడా కలుపుకొనిపోయే ప్రజాస్వామ్యబద్ధమైన పాలన, ఒక సామరస్య సుహృద్భావ వాతావరణంలో జరుగుతూ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో చర్చలు కీలక పాత్ర వహిస్తాయి. దేశంలో ఈ మే నెల నాటికి మణిపూర్ మారణ హోమానికి రెండేళ్లు నిండింది. కుకీ మెయితీ జాతుల మధ్య వైరంగా పరిణమించిన రిజర్వేషన్ల సమస్యను అటు రాష్ట ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోగా, దాదాపు 300 మంది మరణించినా చేష్టలుడిగిన ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహించాయి. చర్చలు జరిపే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు.

చివరికి ముఖ్యమంత్రి బైరాన్ సింగ్ తప్పుకుంటే రాష్ట్రపతి పాలన విధించారు. ప్రధాన మంత్రి మాత్రం ఏనాడు మణిపూర్ గురించి పార్లమెంటులో మాట్లాడడానికి ఇష్టపడ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పోరాటం చేస్తున్న జాతులతో చర్చలు జరపడానికి ఇష్టపడలేదు. సరిహద్దు దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏప్రిల్ నెల చివరలో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులను మతం (Tourists religious) పేరుతో కాల్చి చంపారు. యావత్ ప్రపంచం ఉలిక్కిపడి పాక్ దుశ్చర్యను ఖండించింది. అందుకు భారత ప్రభుత్వం కూడా వెంటనే ప్రతిస్పందించి ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకుంది. శత్రుదేశంపైన పైచేయిగా ఉండి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనవసర జోక్యంతో భారత్ కాల్పుల విరమణ చేసింది. దానిపై అనేక విమర్శలు వచ్చినా మోడీ ప్రభుత్వం జవాబు చెప్పలేదు. పాకిస్తాన్‌ను మోకాళ్ళ మీద నిలబెడతామని గొప్పలు పోయింది.

కానీ ఏమి సాధించారో చెప్పుకోలేకపోయింది. 27 మంది విలువైన ప్రాణాలు పోకుండా కాపాడుకోలేకపోవడం ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌లో కచ్చితంగా భద్రతా బలగాల వైఫల్యమే. ప్రాణానికి ప్రాణం సమాధానం కాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను సాధించేవరకు విశ్రమించేది లేదన్న మోడీ హఠాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించడం ఆశ్చర్యకరం. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఘనతగా చెప్పుకుంటున్నాడు. కాల్పుల విరమణ ఎందుకు చేయవలసి వచ్చిందో మోడీ ప్రభుత్వం ఈనాటి వరకు చెప్పుకోలేకపోయింది. పార్లమెంటు సమావేశాలు జరపాలన్న డిమాండ్ కూడా తిరస్కరించింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దండకారణ్యాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే పనిలో భాగంగా అక్కడ ఉన్న మావోయిస్టులను అనేక మందిని ఎన్‌కౌంటర్ పేర కాల్చి చంపి వారికి మద్దతుగా ఉన్న అమాయక ఆదివాసీలను కూడా పొట్టన పెట్టుకుంది.

నేడు మోడీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల జాడలేకుండా చేస్తామని కంకణం కట్టుకొని అనేక దఫాలుగా కాల్పులు జరుపుతూ మావోయిస్టులను ఏరివేస్తున్నది. ఈ సందర్భంగా మావోయిస్టులు ఒక శాంతి చర్చల ప్రతిపాదన చేయగా లటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం దానిని పరిగణించకుండా ఏకపక్షంగా అడవులలో కాల్పులు జరుపుతూనే ఉంది.ఒక రకంగా చెప్తే మావోయిస్టులు అస్త్ర సన్యాసం చేయగా కేంద్ర ప్రభుత్వమే ఒంటరిగా యుద్ధం చేస్తున్నట్లు ఉన్నది. ఈ యుద్ధం ఎవరి కోసం జరుగుతున్నదో సగటు భారతీయుడికి బోధపడడం లేదు. మావోయిస్టులను తుద ముట్టించిన బలగాలను కేంద్ర హోం మంత్రి అభినందించడం విడ్డూరం.ఇది సిద్ధాంతం పైన యుద్ధమా లేక వ్యక్తులతోనా అనేది అర్థం కావడం లేదు. వేల కొద్ది మావోయిస్టులను మట్టుపెట్టారు. ప్రజాస్వామ్యంలో ఆయుధానికి తావు లేదు. హింసకు స్థానం లేదు.

మావోయిస్టులకు ప్రజాస్వామ్యంపై చర్చ నమ్మకం ఉందా లేదా అనేది మరో చర్చ. కానీ ప్రజాస్వామిక ప్రభుత్వం చర్చలను ప్రతిపాదించకపోయినా కనీసం చర్చలకు అంగీకరిస్తే తన పెద్దరికాన్ని, ఔన్నత్యాన్ని నిలబెట్టుకునేది. దేశంలోనే వామపక్షాలు, మేధావులు ఈ చర్చలను స్వాగతిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటూ యుద్ధం చేయడం వెనుక దానికున్న ప్రయోజనాలు మనం ఆలోచించాలి. కేవలం అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడం కోసమే. అందుకు అడ్డుగా నిలుస్తున్న మావోయిస్టులపై కక్ష కట్టింది కేంద్ర ప్రభుత్వం. మావోయిస్టుల సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా రాజకీయ, సామాజిక కోణంలో ఆలోచించలేకపోవడమే ఇందుకు కారణం. కేంద్ర ప్రభుత్వమే చొరవ చూపి చర్చల ప్రక్రియకై తెరలేపితే దేశంలోని ప్రజలందరూ స్వాగతించేవారు, అభినందించేవారు.మావోయిస్టు రహిత దేశం, మావోయిస్టులు ఎక్కడున్నా ఏరివేస్తాం లాంటి ప్రకటనలు, నినాదాలు కాదు ప్రజలకు కావలసింది.

ఇవేమీ వారి పొట్టనింపవు. ఆదివాసీల ఆకలి తీర్చవు. శాంతి చర్చల్లో మావోయిస్టు ఎజెండా చర్చించి కేంద్ర ప్రభుత్వం తన విధానాల ద్వారా ఏ రకంగా వాటిని అమలు పరుస్తున్నదో వివరించవచ్చు. వారిని ఒప్పించవచ్చు. ఇటు ప్రభుత్వం అయినా అటు మావోలైనా ప్రజలు ముఖ్యంగా ఆదివాసీల సంక్షేమం కోసమే పని చేస్తున్నప్పుడు సంఘర్షణకు తావులేదు. అందుకు ఒప్పుకోని ప్రభుత్వానికి ఇతర ప్రయోజనాలు ఉన్నాయన్నది స్పష్టం.లక్షల కోట్ల రూపాయలు విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే అనేది జగమెరిగిన సత్యం. అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలు నిరాశ్రయులవుతారు. భవిష్యత్తులో పర్యావరణ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. వేల మంది బలగాలను దింపి దండకారణ్యంపై నలువైపులా దాడి చేసి పిడికెడు మంది మావోయిస్టులకు స్థానం లేకుండా చేస్తున్నది.

ఇందులో బలయ్యేది అమాయక ఆదివాసీలే. వారు దిక్కు తోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ తమ స్థావరాలను కాళీ చేయడం గమనార్హం. ఒకప్పుడు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ బిడి శర్మ వారి జీవితాల్లో ఎంతో మార్పు కోసం తాను ఎన్నో అవమానాల పాలయ్యాడు. భూస్వాముల నుండి, ప్రైవేట్ కంపెనీల నుండి అడవులను, వాటిలోని ఖనిజ సంపదను కాపాడడంలో సఫలమయ్యాడు.అదివాసులకు అనుకణం అండగా నిలిచాడు. కానీ రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పాలక వర్గాల వైపు నేడు నిస్సహాయంగా చూస్తూ ఉంది. మొన్న నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నక్సలైట్లతో చర్చల ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. రాజ్య హింస, ప్రైవేటు హింస రెండు కూడా ప్రజాస్వామ్యంలో ఖండించదగినవే. మావోయిస్టులు ఏమీ దేశద్రోహులు కారు కదా! వారు కూడా ఈ దేశప్రజల కోసం పోరాడుతున్న వారే. వారితో సైద్ధాంతిక వైరుధ్యం సహజమే. వారి మార్గం ప్రభుత్వాలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు.

విదేశాలతో సైతం చర్చలకు సిద్ధమవుతున్న మన దేశం, ఇక్కడే ఉండి, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం తాము ఎంచుకున్న మార్గంలో పోరాడి అలసిపోయి శాంతి చర్చలకు ప్రతిపాదించినా అందుకు మన ప్రభుత్వాలు ఏమాత్రం సుముఖత వ్యక్తపరచకపోవడం ప్రజాస్వామ్య వాతావరణాన్ని ప్రశ్నిస్తున్నది. వారితో చర్చించి ఒప్పించి వారిని జనజీవన స్రవంతిలో భాగం చేసే అవకాశం ఈ చర్చల ద్వారా ప్రభుత్వానికి ఉంది. అందరినీ మట్టుబెట్టిన తర్వాత శాంతి ప్రక్రియకు అర్థం ఉండదేమో! లేదా ఈ శాంతి చర్చలకు లేదా కాల్పుల విరమణ కోసం కూడా ట్రంప్ మధ్యవర్తిత్వం అవసరమేమో! చర్చలతో ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుమడిస్తుంది. ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందన్న సత్యాన్ని మన పాలకులు ఏనాటికి గుర్తిస్తాడో? “నువ్వు చెప్పే విషయాన్ని నేను అంగీకరించకపోవచ్చు, కానీ అది చెప్పడానికి నీకు గల హక్కును నా ప్రాణమిచ్చి అయినా కాపాడుతాను’ అన్న ఫ్రెంచ్ రచయిత వోల్టేర్ మాటలు మన దేశంలో నీటి మూటలేనా? పాలకులు ఆలోచించాలి.

  • శ్రీశ్రీ కుమార్
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News