మన తెలంగాణ/హైదరాబాద్: గంజాయి సరఫరా చేసే భారీ రాకెట్‌ను ఈగల్ టీం ఆపరేషన్ డెకాయ్ ద్వారా ఆదివారం చేదించింది. ఈగల్ ఎస్పీ సీహెచ్. రూపేష్, డీఎస్సీ సి.హరిశ్చంద్ర రెడ్డి, సిఐ పి.రమేష్ రెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వీరి కథనం ప్రకారం గంజాయి సరఫరా చే స్తున్న మహారాష్ట్రకు చెందిన నిందితుడు సందీప్‌ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సందీప్ ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు అందులో ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా ఆదివా రం ఆపరేషన్ డెకాయ్ చేపట్టింది. తమ ఆపరేషన్ వివరాలను ఈగల్ టీం ఆపరేషన్ డెకాయ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో నిషేదిత గంజాయి సరఫరా, విక్రయానికి పాల్పడుతోన్న నేరస్థుడు సందీప్ గురించి తమ కు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అం దిందని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ వ్య క్తి గచ్చిబౌలిలోని సైబరాబాద్ బ్రాంచ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సమీపంలో తరచుగా సంచరిస్తూ అక్రమ మాదకద్రవ్యాల అమ్మకాలను నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు.
ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలలో పని చేసే ఉద్యోగులు, కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగించినట్టు వివరించారు. గచ్చిబౌలి ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్న సమాచారంతో ఈగల్ టీం బృందం మారు వేషాలలో నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ బృందాలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, గచ్చిబౌలి ప్రాంతం చుట్టూ నిఘా పెట్టి డ్రగ్స్ అమ్మేవారిని. అలాగే వాటిని కొనుగోలు చేసేవారిని గుర్తించినట్టు పేర్కొన్నారు. తమ అదుపులో ఉన్న నిందితుడు సందీప్ సెల్ ఫోన్‌లో ఉన్న 100 మందికి పైగా వినియోగదారులకు మెసేజ్ పెట్టిన్నట్లు తెలిపారు. అందులో ఉన్న నెంబర్లకు కోడ్ భాషలో భాయ్ బచ్చా ఆగయా అంటూ వాట్సప్ లోకేషన్ పోస్ట్ చేయగా, మెసెజ్ పోస్ట్ చేసిన రెండు గంటల వ్యవధిలోనే గంజాయి కొనుగోలు చేయడానికి వినియోగదారులు వచ్చారన్నారు. కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తులను చూసి తమ ఈగల్ బృందం ఆశ్చర్య పోయిందని తెలిపారు. డెకాయ్ ఆపరేషన్‌లో భార్యాభర్తల జంట ఒకరు తమ 4 సంవత్సరాల కొడుకుతో కలిసి గంజాయి కొనడానికి వచ్చారని, వారికి పరీక్షలు నిర్వహించగా భర్తకు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అలాగే మరొక భార్యాభర్తల జంట కూడా గంజాయి కొనడానికి వచ్చిందని వారిలో భార్య తప్పించుకోవడానికి ప్రయత్నించినట్టు తెలిపారు. గంజాయి కొనడానికి వచ్చిన 14 మందికి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించగా వారందరికీ పాజిటీవ్ వచ్చినట్టు తెలిపారు.
వారందరికి చికిత్స, పునరావాసం కోసం సర్టిఫైడ్ డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించినట్లు పేర్కొన్నారు.
ప్రధాన వ్యాపారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం పట్టుబడిన నిందితుడు సందీప్ మహారాష్ట్ర నుంచి 50 గ్రాముల బరువు కలిగిన 100 ప్యాకెట్లను తీసుకుని వచ్చి ఒక్కో ప్యాకెట్ రూ. 3 వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సమయంలో పట్టుబడకుండా తప్పించుకున్న మహారాష్ట్రకు చెందిన మరోక వ్యక్తి సరఫరా నెట్‌వర్క్‌ను గుర్తించడానికి సాంకేతిక బృందాలు వినియోగదారుల మొబైల్ ఫోన్‌ల నుంచి సేకరించిన వాట్సాప్ కమ్యూనికేషన్ లాగ్‌లు, ఫోన్ నంబర్‌లు, డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. విస్తృత పంపిణీ, డిమాండ్ నెట్‌వర్క్‌ను వెలికి తీసేందుకు 100 కంటే ఎక్కువ మంది కస్టమర్ల డేటాబేస్‌ను పరిశీలిస్తున్నామన్నారు. సందీప్ ఫోన్‌లో గుర్తించిన 14 మంది వినియోగదారును అదుపులోకి తీసుకోగామిగిలిన 86 మందిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 14 మంది నుంచి స్వాధీనం చేసుకున్న డేటాతో మాదక ద్రవ్య సరఫరా నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఐటీ కారిడార్, దాని చుట్టుపక్కల పరిసరాల్లో మాదకద్రవ్యాల పదార్థాల ఉనికిని తొలగించడానికి నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పట్టుబడిన వినయోగదారులు వీరే
ఆపరేషన్ డెకాయ్‌లో 14 మందిని పట్టుకున్నామని వారిటో ఐటి ఉద్యోగులు, రిలేషన్‌షిప్ మేనేజర్లు, టెక్నీషియన్లు, ఆన్‌లైన్ ట్రేడర్లు, విద్యార్థులు, డెంటల్ టెక్నీషియన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారిలో నవీన్ (ఆన్‌లైన్ ట్రేడర్), అయుష్ (విద్యార్థి), నికిల్ (రేసింగ్ ఇంజనీర్), సింధూర (ఆర్కిటెక్చర్), హసన్ (ప్రాపర్టీ మేనేజర్), క్రాంతి (ఐటి ఎంప్లాయ్), అఖిల్ (డెంటల్ టెక్నీషియన్), శివ(బిజినెస్ రిలేషన్ షిప్ మేనేజర్), సందేశ్ (ఫ్రీలాన్స్ యాడ్ ఎజెన్సీ), సాయిరాజ్ (రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్), అఖిల్ (ట్రావెల్ ఎజెన్సీ), స్వామి (డ్రైవర్), తుషార్ (ఐటి ఎంప్లాయ్), అర్పిత్(ఐటి ఎంప్లాయ్) ఉన్నారని ఈగల్ పోలీసులు తెలిపారు.