మన తెలంగాణ/మేడ్చల్ జిల్లాః కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని కోరారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ను కలిసి మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ది పనులపై చర్చించారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు, బస్తీలలో సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మల్కాజిగిరి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు, అదనపు గధుల నిర్మాణానికి రూ.2.5 కోట్ల నిధులు కేటాయించినందుకు కలెక్టర్‌కు ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి హైదరాబాద్ జిల్లాల మద్య మల్కాజిగిరి మారేడుపల్లి మండలాల భౌగోలిక సరిహద్దుల్లోని సర్వే నంబరు 844లో సుమారు 55 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని ఎమ్మెల్యే కలెక్టర్‌కు వివరించారు.
ప్రభుత్వ భూమిలో ఏడి సర్వే చేయించి నవోదయ స్కూల్‌కు కేటాయించాలని కోరారు. మల్కాజిగిరి వినోబా నగర్ సర్వే నంబరు 278, యాప్రాల్ సర్వే నంబరు 171లోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముస్లీం, క్రైస్తవుల స్మశాన వాటికల ఏర్పాటుకు, బ్రాహ్మణ కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలాలు కేటాయించాలన్నారు. జీవో 58, 59లో స్థలాల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసి డబ్బులు చెల్లించిన పలువురు ప్రభుత్వ నిర్ణయంతో అయోమయానికి గురవుతున్నారని వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత రాము యాదవ్, తోట నరేందర్‌రెడ్డి, డోలీ రమేష్, చిన్న యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, హేమంత్ పటేల్, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.