న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ కదలికలను ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అతడి అడ్డా అయిన బహవల్పూర్ నుంచి 1,000 కిలోమీటర్ల దూరం లోని గిలిత్ ఖలిస్థాన్ ప్రాంతంలో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్ల కిందటే స్కర్దూ లోని సద్‌పర రోడ్ ప్రాంతంలో అతడిని గుర్తించారు. ఆ ప్రదేశంలో రెండు మసీదులతో పాటు మదర్సాలు, చాలా ప్రైవేటు , ప్రభుత్వ అతిథి గృహాలు ఉన్నాయి. బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఉండాలంటే జైషే చీఫ్‌నకు పీవోకేకు మించిన ప్రదేశం లేదు. సహజసిద్ధమైన పార్కులు, సరస్సులతో ప్రశాంతంగా ఉంటుంది. ఇటీవల పాక్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ మసూద్ అఫ్గానిస్థాన్‌లో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అవసరమైతే అతడిని భారత్‌కు అప్పగించేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు. అల్‌జజీరా న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూఏ జైషే మహమ్మద్ సంస్థ నేత మసూద్ అజార్ తమ దేశంలో లేడని, ఒకవేళ ఉన్నట్టు భారత్ కచ్చితమైన సాక్షాలు సమర్పిస్తే అతడ్ని అరెస్టు చేసామని పేర్కొన్నారు.
లష్కరే తయ్యిబా అధిపతి హఫీజ్ సయీద్, జైషే మహమ్మద్ (జేఎం) చీఫ్ మసూద్ అజార్‌లను భారత్‌కు అప్పగించడం గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ..“హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. అతను కస్టడీలోనే ఉన్నాడు. మసూద్ అజార్ ఎక్కడున్నాడో మాకు తెలియదు. అఫ్గానిస్థాన్‌లో ఉన్నాడేమో. ఒక వేళ అతడు పాక్ గడ్డపైనే ఉన్నట్టు భారత ప్రభుత్వం మాకు కచ్చితమైన సమాచారం ఇస్తే అతడిని అప్పగించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ” అని భుట్టో పేర్కొన్నారు. జైషే సంస్థ ఆన్‌లైన్ ఖాతాలు ఇంటెలిజెన్స్ వర్గాలను తప్పుతోవ పట్టించేలా పలు పోస్టులు చేస్తున్నాయి. ఈ క్రమంలో పాత ఆడియో క్లిప్‌ను రీసైకిల్ చేసి ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేయడం వంటి వాటికి పాల్పడుతున్నాయి. అయినా నిఘా వర్గాలు మాత్రం జాగ్రత్తగా అతడి కదలికలపై దృష్టి సారించాయి. భారత్‌లో పలు ఉగ్రదాడుల వెనుక మసూద్ హస్తం ఉంది. 2016 లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్, 2019 పుల్వామా దాడికి జైషే పాల్పడింది.