Tuesday, May 20, 2025

ఇకనైనా మేల్కొనాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది పసిపిల్లలతో సహా పదిహేడు మంది ప్రాణాలు అందులో కాలి బూడిదయ్యాయి. ఈ వార్త వినగానే మన గుండె ఎంత బరువెక్కిందో కదా? దేశంలో వేగంగా పెరుగుతున్న నగరాలు ఇలాంటి విపత్తులకు ఎందుకు నిలయంగా మారుతున్నాయి అనేది మనం తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఇవి కేవలం అనుకోకుండా జరిగే ప్రమాదాలు అనుకుంటే పొరపాటే. తరచుగా ఇవి మన నియంత్రణలో, వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగానే జరుగుతాయి. వీటి వెనుక చాలా కారణాలున్నాయి. భవన నిర్మాణ నిబంధనలు సరిగా పాటించకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, అజాగ్రత్త, బాధ్యతారాహిత్యం ఇవన్నీ కలిసి ఒక విషాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇలాంటి విపత్తులనుండి బయటపడాలంటే, మన నగరాలు ఎందుకు కాలిపోతున్నాయో లోతుగా అర్థం చేసుకోవాలి. మనం భవనాలను ఎలా కడుతున్నామో, ఎలా వాటిని పర్యవేక్షిస్తున్నామో, వాటిలో ఎలా నివసిస్తున్నామో అనే దానిపై సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంటలు అంటుకోవడానికి కారణాలు చూస్తే సాధారణంగా మనకు ముందుగా వినిపించేవి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌లు.

పాతబడిపోయిన వైరింగ్, సరిగా నిర్వహించని విద్యుత్ వ్యవస్థలు, అవసరానికిమించి భారం మోస్తున్న సర్క్యూట్లు, నాణ్యతలేని వైర్లు, శిక్షణలేని వ్యక్తులు చేసే మరమ్మతులు. ఇవన్నీ షార్ట్ సర్క్యూట్లకు దారితీస్తాయి. మనం ఉండే ఇంట్లో పనిచేసే చోట ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలా ఉంది?ఎప్పుడైనా తనిఖీ చేయించామా? ఈ చిన్న విషయాలే పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. అలాగే వంట గ్యాస్ సిలిండర్ల లీకేజీలు, పాడైపోయిన రెగ్యులేటర్లు లేదా గ్యాస్ పైప్‌లైన్లు కూడా ప్రమాదకరమే. సులభంగా మంటలు అంటుకునే వస్తువులను -పెయింట్స్, ప్లాస్టిక్, రసాయనాలు వంటివి – జాగ్రత్త లేకుండా ఇంట్లోనో, దుకాణాల్లోనో నిల్వచేయడం చాలా ప్రమాదం. వంట చేసేటప్పుడు శ్రద్ధ వహించకపోవడం, సిగరెట్లు తాగేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండటం వంటి చిన్నచిన్న పొరపాట్లు కూడా క్షణాల్లో పెద్ద మంటలకు కారణమవుతాయి.

మన నగరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కానీ ఆ పెరుగుదల ప్రణాళికాబద్ధంగా లేదు. దీనివల్ల జనసాంద్రత విపరీతంగా పెరిగిన్నది. కింది అంతస్తులో దుకాణాలు, పైన నివాసాలు ఉండే భవనాలు మనం చూస్తేనే ఉన్నాం. వీటిలో ఒకదానికొకటి అంటుకునే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా పాత నగరాలలోని ఇరుకైన వీధులు, ఒకదానికొకటి ఆనుకుని ఉండే భవనాలు, అగ్నిమాపక వాహనాలు వెళ్లడానికి, రెస్క్యూ సిబ్బంది పనిచేయడానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయి. అక్రమ నిర్మాణాల సంగతి చెప్పనక్కర్లేదు. అవి అత్యవసర మార్గాలను మూసివేస్తాయి. భవనాలను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. సరైన నిష్క్రమణ మార్గాలు లేకపోవడం వల్ల మంటలు చెలరేగినప్పుడు బయటపడటం కష్టమవుతుంది. మనకు అగ్ని భద్రతా నియమాలు లేవా? అంటే ఉన్నాయి. నేషనల్ బిల్డింగ్ కోడ్ వంటివి, రాష్ట్రాల అగ్నిమాపక చట్టాలు భవనాలను ఎలా కట్టాలో, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో చెబుతాయి.

కానీ వీటి అమలులో తీవ్రమైన లోపాలున్నాయి అనేది ఒప్పుకోవాల్సిన నిజం. తనిఖీలు చేసే అధికారులు సరిపోవడం లేదు. వారికి అవసరమైన ఆధునిక పరికరాలు లేవు. అనుమతులు, తనిఖీల ప్రక్రియ చాలా జాప్యంతో కూడుకున్నది లేదా అవినీతికి తావు ఇస్తుంది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. జరిమానాలు అంత ఎక్కువగా ఉండవు, కేసులు నెమ్మదిగా నడుస్తాయి. తప్పనిసరిగా ఉండాల్సిన ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు లేకుండానే అనేక భవనాలు పనిచేస్తున్నాయి. భవనాలను కట్టే కొందరు వ్యక్తులు ఖర్చు తగ్గించుకోవడానికి నిబంధనలను పాటించరు. భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా చెప్పాలంటే భద్రత పట్ల నిర్లక్ష్యం అనేది ఒక సంస్కృతిగా మారిపోయింది. భవనాలలో

నివసించే వారికి, పనిచేసే వారికి అగ్నిప్రమాదం వస్తే ఏం చేయాలో, అత్యవసర మార్గాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. అగ్నిప్రమాద పరికరాలు ఉన్నా ఎలా వాడాలో తెలీదు. రెగ్యులర్ ఫైర్ డ్రిల్స్ ప్రైవేట్ భవనాలలో చాలా అరుదు. ప్రభుత్వాలు, అధికారులు, భవనాల యజమానులు, అందులో నివసించే ప్రజలు అందరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి. ముందుగా చట్టాలను కఠినంగా అమలు చేయాలి. కేవలం చట్టాలు ఉండటం కాదు, వాటిని అమలు చేసే యంత్రాంగం బలంగా ఉండాలి. అగ్నిమాపక విభాగాన్ని బలోపేతం చేయాలి. ఆధునిక పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇరుకైన ప్రదేశాలకు వెళ్లగలిగే చిన్న ఫైర్ టెండర్లు వంటివి వారికి అందించాలి.

యజమానులు, నిర్వాహకులు తమ భవనాలలో అగ్ని భద్రతా ప్రమాణాలను పాటించే బాధ్యతను తీసుకోవాలి. విద్యుత్ వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, నిర్వహణ చేయించాలి. అగ్ని ప్రమాదం వస్తే ఎలా వ్యవహరించాలో అక్కడ నివసించే వారికి, పనిచేసే వారికి శిక్షణ ఇవ్వాలి. భద్రతా లోపాలు కనిపిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి. అభివృద్ధి చెందుతున్నామని సంతోషిస్తున్నాం కానీ, భద్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ప్రాణ నష్టం జరుగుతుంది. అగ్ని భద్రత అనేది ఎవరో ఒకరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. అవగాహన ఉంది, నియమాలు ఉన్నాయి, కానీ అమలు చేయడంలోనే సమస్య ఉంది. బాధ్యత తీసుకోవాలి, కలిసి పనిచేయాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆపగలం. మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది.

-జనక మోహనరావు దుంగ
82470 45230

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News