మెదక్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తృతమైన విధ్వంసం చోటు చేసుకుంది. హవేలి ఘనపూర్ మండలంలో బుధవారం రాజ్పేటలోని గంగమ్మ వాగులో బెస్త సత్యం, యాదగౌడ్ కొట్టుకుపోయారు. బెస్త సత్యం మృతదేహం లభ్యమైందని, గల్లంతైన యాదగౌడ్ ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు, కుంటలు పొంగిపొర్లాయి, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, గిరిజన గృహాలను వరద నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పొలాలకు వెళ్ళిన చాలా మంది రైతులు, చేపలు పట్టడానికి వెళ్ళిన మత్స్యకారులు వరద నీటిలో చిక్కుకుపోయారు. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలంలోని ధూప్ సింగ్ తండా ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరడంతో సుమారు 15 ఇళ్లలోని నివాసితులు తమను తాము రక్షించుకోవడానికి ఇండ్ల పైకప్పులు ఎక్కాల్సి వచ్చింది. తండాకు వెళ్లే అన్ని రోడ్లు నీట మునిగిపోవడంతో వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్ డిఆర్ఎప్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకోలేకపోయారు. దీంతో సైన్యాన్ని సమాచారం ఇచ్చారు. సుమారు 100 మంది ఆర్మీ సిబ్బంది నిన్న రాత్రి మెదక్ పట్టణానికి చేరుకుని గురువారం తెల్లవారుజామున సహాయక చర్యలు ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లాలో మంగళవారం తమ పొలాన్ని సందర్శించిన తర్వాత అక్బర్పేట మండలంలోని చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు వరదల్లో చిక్కుకుపోయారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి అధికారులు గురువారం సహాయక చర్యలు ప్రారంభించారు. గత రెండు రోజుల్లో మెదక్, సిద్దిపేట జిల్లాలలోని చాలా ప్రాంతాల్లో 16 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరదలు, కొనసాగుతున్న సహాయక చర్యలు, అవసరమైన తదుపరి చర్యలపై చర్చించడానికి మెదక్ జిల్లాకు వస్తున్నారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను.. వాతావరణం అనుకూలిస్తే ఏరియల్ సర్వే నిర్వహించే అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు.
Read also: ప్రవాహం అవతలి వైపు చిక్కుకుపోయిన పశువుల కాపరిని రక్షిస్తాం: కలెక్టర్ అభిలాష