యువతకు ఉపాధి కల్పనకు ప్రణాళికాబద్ధ్దంగా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా, వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో 80కి పైగా కంపెనీలలో ఐదు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించేలా మెగా జాబ్‌మేళాను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని మార్గాలు అన్వేషించి అమలు చేస్తున్నామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామని, యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. చిన్న ఉద్యోగం అయినా ముందు జాయిన్ కావాలని, ప్రతి నిమిషం విలువైనదని, ఉద్యోగం చేస్తూ కూడా యువత తమ అభివృద్ధి లక్షాల సాధన కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని హితవు పలికారు.
యువత అనేక ఆశలతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారని, కోరి తెచ్చుకున్న తెలంగాణలో గత పాలకులు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేకపోయారని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు చూపించటంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పక్షాళన చేశామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, గ్రూప్ వన్, గ్రూప్ టూ పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. పట్టణాలలో మెగా జాబ్‌మేళాలను నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్త్తున్నామని తెలిపారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు 9 వేల కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న స్వయం ఉపాధి యూనిట్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నామని అన్నారు.
వైరా ఎంఎల్‌ఎ మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. ఉద్యోగ అవకాశాలు కోసం ఇంతకు ముందు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని, కానీ నేడు ప్రపంచస్థాయి కంపెనీలు మన ముంగిటకు వచ్చి ఉద్యోగాలు కల్పించటం ఎంతో గర్వకారణమని అన్నారు. అనంతరం ఇంటర్వూలలో ఎంపికైన యువతకు వివిధ కంపెనీల ఆఫర్ లెటర్లను డిప్యూటీ సియం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహయం రఘరాం రెడ్డి, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ నాయుడు సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సింగరేణి సిఎండి బలరాం, అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, సింగరేణి జనరల్ మేనేజర్ శాలోమ్ రాజు, కాంగ్రెస్ నాయకులు బొర్రా రాజశేఖర్, శీలం వెంకటనర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.