ఎంటర్‌టైన్‌మెంట్, చరిష్మాతో ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘మెగా157’ బ్లాక్‌బస్టర్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోంది. వరుస విజయాలు అందించిన అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుశ్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు. నయనతార చిరంజీవికి జోడిగా నటిస్తున్నారు. తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావిపూడి నిరీక్షణకు తెరపడింది. శుక్రవారం హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనిల్ రావిపూడి లానే చిరంజీవి కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.