బిజెపిలో 75 ఏళ్లకు అన్ని అధికార, పార్టీ పదవుల నుండి నిష్క్రమించాలనే నిర్దుష్టమైన నిబంధన ఏమీ లేనప్పటికీ ఈ అంశం ఇప్పుడు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత డా. మోహన్ భగవత్ గత వారం మరో సందర్భంలో సీనియర్ సంఘ్ నేత మోరోపంత్ పింగ్లేపై రాసిన గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ ఆయన అన్నమాటలను ఉటంకించడంతో పరోక్షంగా బిజెపి నాయకులకు ఆయన సందేశం ఇచ్చారనే కథనాలు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలను, రాజకీయ నాయకులను దృష్టిలో ఉంచుకొని ఆ విధమైన మాటలు చెప్పలేదని అంటూ ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ వివరణ ఇవ్వడం గమనిస్తే ఆయన ప్రకటన రాజకీయంగా ఎంతటి కలకలం రేపిందో వెల్లడి చేస్తున్నది. అయితే, ఆయన ప్రకటన కన్నా ముందే రోజే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన రాజకీయ రంగ నిష్క్రమణ గురించి ప్రస్తావించడం కూడా ఈ కలకలంకు ఆజ్యం పోసింది. ఇదంతా మరో రెండునెలల్లో ప్రధాని నరేంద్ర మోడీ 75 ఏళ్ళ వయస్సుకు రాజకీయ ప్రకంపనలకు దారితీస్తున్నది.
దానితో తాను ఏర్పర్చిన ఈ నిబంధనను ప్రధాని తాను ఏమేరకు పాటిస్తారో అన్న ఆసక్తి అన్ని వర్గాలలో సహజంగానే నెలకొంటుంది. 2015లో ప్రధాని పదవి చేపట్టగానే (assuming office Prime Minister) పార్టీ ప్రారంభంనుండి కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంత కుమార్ వంటి వారికి కనీసం పార్టీ పార్లమెంటరీ బోర్డులో కూడా స్థానం లేకుండా చేయడంతో అనధికారికంగా అటువంటి నిబంధన పార్టీలో అమలు చేయడం ప్రారంభించారు. ‘మార్గదర్శకులు’ అంటూ వారికి ఓ హోదాను కట్టబెట్టిన్నప్పటికీ అటువంటి వారితో ఇప్పటి వరకు ఒక సమావేశం కూడా జరపకపోవడం గమనార్హం. అప్పటినుండి అనేకమంది నాయకులను గవర్నర్లు, మంత్రులు, పార్టీ పదవులనుండి ఈ నిబంధన పేరుతో తొలగిస్తూ వస్తున్నప్పటికీ రాజకీయ అవసరాలకోసం 80 ఏళ్ళు పైబడిన వారికి సైతం ఎన్నికలలో సీట్లు ఇవ్వడం, నామినేట్ పదవులు ఇవ్వడం చేస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు అమిత్ షా తన రాజకీయ నిష్క్రమణ గురించి ఎందుకు ప్రస్తావించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆయన మరో 15 ఏళ్లకు గాని 75 ఏళ్ళ పరిధికి చేరుకోరు.
రాజకీయాల నుండి నిష్క్రమిస్తే తాను వేదాలు, ఉపనిషత్తులు చదువుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ గడుపుతానని చెప్పడం ద్వారా చివరికంటా పదవులను పట్టుకొనే వేలాడననే సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన వ్యవసాయం చేస్తారని ఎవ్వరూ విశ్వసించే పరిస్థితి లేదు. కేవలం ఓ రాజకీయ ఎత్తుగడగా ఈ ప్రకటన చేశారని స్పష్టం అవుతుంది. నేటి జాతీయ నాయకులలో వ్యక్తిగత విషయాలపై బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడని నాయకుడు అమిత్ షా. కేవలం ఈ మధ్య ఒకసారి తన ఇద్దరు మనవరాళ్లతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. కుటుంబ విషయాలను మీడియావారు ప్రస్తావించినా నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చేందుకు నిరాకరిస్తారు. అటువంటిది ఈ విషయం గురించి ప్రసావించడం సహజంగానే రాజకీయంగా ఆసక్తి కలిగిస్తుంది. ఆయన ఈ ప్రకటన మహిళా బృందాలతో మాట్లాడుతున్నప్పుడు చేశారు. సహకార మంత్రిగా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నట్లు చెబుతూ వారికి నేరుగా వారి బ్యాంకు అకౌంటులలో చెల్లింపులు జరిగేటట్లు చూడటమే తన అభిలాష అని చెప్పారు.
అయితే, ఈ లక్ష్యం నెరవేరేందుకు ఓ పదేళ్లు పట్టవచ్చని చెప్పడం ద్వారా మరో పదేళ్లు అధికారంలో కొనసాగుతానని సంకేతం ఇదే సమయంలో ఇచ్చారు. బిజెపి అధ్యక్ష ఎన్నిక విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో ఆయన కొంత అసహనంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. గత 11 ఏళ్లుగా పార్టీ వ్యవహారాలు అన్ని ఆయన కనుసన్నలలో జరుగుతున్నాయి. తన తర్వాత ఐదున్నరేళ్లుగా జెపి నడ్డా అధ్యకునిగా ఉంటున్నప్పటికీ మొత్తం అధికారం అమిత్ షా చేతుల్లోనే కొనసాగుతున్నది. పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆయన అభీష్టం మేరకే జరుగుతున్నాయి. అందుకనే నడ్డా వారసునిగా సహజంగా తాను ఎంపిక చేసేవారే ఉండాలని కోరుకుంటారు. కానీ, గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో బిజెపి ఎంతో ఎదిగిందని, ఇంకా తమకు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు అవసరం లేదని, సొంతంగా తమ వ్యవహారాలు చక్కబెట్టుకోగలమని చెప్పడం ద్వారా నడ్డా పార్టీకి ఎంతో నష్టం కలిగించారు.
ఆయన మాటల ప్రభావమో, మరేమిటో గాని 400 సీట్లు గెలుస్తామని ప్రచారం చేసుకుంటే సొంతంగా మెజారిటీ కూడా లేకుండా 240 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ప్రతిష్ఠాకరంగా పనిచేయడంతోనే ఓటమి నుండి బిజెపి విజయంవైపు ప్రయాణం చేయగలిగింది. పైగా, ప్రధాని మోడీ ప్రచారంతో మాత్రమే ఓట్లు పొందే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. అందుకనే ఆర్‌ఎస్‌ఎస్ సూచనలను కాదని పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటే రాబోయే రోజులలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే భయం పార్టీ వర్గాలలో ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ సైతం పార్టీ అధ్యక్ష పదవికి ఓ నిర్దిష్టమైన పేరు సూచింపకుండా, ఓ బృందంగా పనిచేస్తూ, పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచే వారిని ఎనుకోవాలని మాత్రమే చెబుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి మధ్య ఏకాభిప్రాయం ఏర్పడటంలేదని చెబుతున్నారు. ఓ విధంగా మొత్తం పార్టీ వ్యవస్థను ఈ మధ్య కాలంలో తలాకుతలం కావించారు. విధానపరమైన విషయాలపై పార్టీలో చర్చలు జరగడంలేదు.
ఎక్కువగా సోషల్ మీడియాపై, ప్రచార వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారు. జెపి నడ్డా పదవీకాలం జనవరి, 2023లోనే అయిపోయింది. అప్పటినుండి ఏదో ఒక సాకుతో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ మరో అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతున్నారు. బిజెపి అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లు మాత్రమే. కానీ 2014 నుండి అమిత్ షా, ఆ తర్వాత జెపి నడ్డా మాత్రమే అధ్యక్షులుగా ఉన్నారు. పార్టీ నిబంధనల మేరకు ఈ పాటికి నాలుగో అధ్యక్షుడు ఉండాల్సి ఉంది. గతంలో బిజెపి నాయకత్వంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సంస్థాగత వ్యవహారాలు క్రమబద్ధంగా జరుగుతూ ఉండెడివి. ప్రతి ఏడాది రెండు సార్లు జాతీయ మండలి సమావేశాలు, మరో రెండు సార్లు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుపుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా అరుదుగా సమావేశాలు జరుపుతున్నారు. చివరకు 2024 పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు బిజెపి ఎంపిల సమావేశాలే జరపడం లేదు.
ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం కూటమి ప్రభుత్వం ఉంటే, కూటమిలో పెద్ద పార్టీ ఎంపిలు ముందుగా తమ నాయకుడిని ఎన్నుకొని, ఆ నాయకుడికి ఇతర మిత్రపక్షాల మద్దతు తీసుకొనేవారు. కానీ, ఆశ్చర్యకరంగా 2024 ఎన్నికల అనంతరం ఎన్‌డిఎ ఎంపిల సమావేశం జరిపే, అందులో నరేంద్ర మోడీని నాయకునిగా ఎన్నుకున్నారు. అంతకు ముందు పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రతి వారం బిజెపి ఎంపిలు సమావేశమై సమావేశాల తీరుతెన్నులు, వ్యూహాలపై చర్చించేవారు. కానీ ఇప్పుడు ఎన్‌డిఎ ఎంపిల సమావేశాలు జరుగుతున్నాయి గాని, విడిగా బిజెపి ఎంపిల సమావేశాలు జరపడం లేదు. పార్టీ ఎంపీల సమావేశాలు జరిగితే విధానపరమైన అంశాలపై నేతలను ప్రశ్నించేందుకు కనీసం 50 మంది ఎంపీలు సిద్ధంగా ఉన్నారని, అందుకనే దాటవేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఏదిఏమైనా ప్రధాని మోడీ 75 ఏళ్ళు రాగానే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి నేతలు స్పష్టం చేశారు. 2024 ఎన్నికలలో ఆయనను ఐదేళ్లపాటు ఎన్నుకున్నారని, అందుకనే 2029 వరకు ఆయనే కొనసాగుతారని నిషికాంత్ దూబే వంటి వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌లో కొంతకాలంగా ఈ నిబంధనను పాటిస్తూవస్తున్నారు. ఇప్పుడు మోడీ కూడా పాటించాలని కోరుకోవడం సహజమే కాగలదు. ఆ మేరకు స్ఫష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకనే ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకుంటుంది. ఒక వంక ప్రధాని మారి, పార్టీకి కొత్త అధ్యక్షుడు కూడా వస్తే మొత్తం పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అందుకనే సహజంగానే ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్నవారు అటువంటి మార్పును స్వాగతిపలేరు.
- చలసాని నరేంద్ర
98495 69050