Thursday, May 29, 2025

నిమ్జ్‌తో మారనున్న మెతుకుసీమ ముఖచిత్రం

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పర్యటించారు. నిమ్జ్ కేంద్రంగా ఆయన పర్యటన సాగింది. ఒకప్పుడు మెదక్ ఎంపిగా ఇందిరా గాంధీ దేశానికి ప్రాతినిధ్యం వహించారు. నాడు ఆమె బిహెచ్‌ఇఎల్, బిడిఎల్, ఒడిఫ్ లాంటి కర్మాగారాలను స్థాపించారు. పటాన్‌చెరు ప్రాంతా న్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు బాటలు వేశారు. నేడు ఈ ప్రాంతం మినీ ఇండియాగా ఉన్నదంటే, నాటి ఇందిరమ్మ చలువనే. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించే కేంద్రాలు ఇక్కడ ఉన్నాయంటే ఆమె దార్శనికతనే. అందుకనే నేటికీ ఇందిరమ్మను ఈ ప్రాంత వాసులు గుర్తు చేసుకుంటున్నాం. ఆమె ముద్ర ఎంత బలంగా ఉన్నదో ఊహించచ్చు. జహీరాబాద్ ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటైతే కూడా ఈ ప్రాంతం దేశ చిత్రపటంలో ప్రముఖంగా నిలుస్తుంది. అందుకనే ఇటీవల సిఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక నిమ్జ్‌కు 100 ఫీట్ల రోడ్డును ప్రారంభించారు.

మరికొన్ని ఇతర పనులను ప్రారంభించినప్పటికీ… ఈ రోడ్డుకు అధిక ప్రాధాన్యత ఉన్నది. ఈ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంది. గతంలో జరిగిన జాప్యాన్ని తొలగించింది. నిమ్జ్ అవసరాన్ని అటు రాష్ట్ర స్థాయి అధికారులకు, ఇటు జిల్లా అధికారులకు సూటిగా తెలియజెప్పింది. అందుకనే ఇప్పుడు ఇక్కడి పనులు త్వరగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద పేట వేస్తున్నందున నిమ్జ్‌కు వెళ్లేందుకు ప్రత్యేకంగా రోడ్డును వేయడం ద్వారా పరిశ్రమలకు కనీస వసతులను కల్పిస్తున్నామన్న సందేశాన్ని చాటి చెప్పారు. నేడు ఈ రోడ్డు, ఈ ప్రాంత భవిష్యత్‌కు దిక్సూచీగా కనపడుతున్నది. మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద రోడ్డు అద్భుతంగా ఆవిష్కృతమైంది. పచ్చని పొలాల మధ్యగా వెళ్తున్న ఈ రోడ్డు అల్లంత దూరాన ఉన్న పారిశ్రామికీకరణకు దారి చూపుతోంది.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో నిమ్జ్ మంజూరయింది. నాటి నుంచి భూసేకరణ జరుగుతూనే ఉన్నది. కానీ, ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. బిఆర్‌ఎస్ ఏలుబడిలో నిమ్జ్ పట్ల కొంత అసక్తత కనిపించింది. దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన భూసేకరణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అయినప్పటికీ 12,500 ఎకరాల భూసేకరణను లక్షంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు సుమారుగా 7,500 ఎకరాలను సేకరించగలిగారు. ఇంత పెద్ద ఎత్తున భూమి అందుబాటులో ఉండడం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు దాదాపుగా రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. అందుకనే, త్వరలో హ్యుందాయ్ కార్ల ఉత్పత్తి ఇక్కడ ప్రారంభించబోతున్నదని సిఎం ప్రకటించారు. భూ సేకరణ పెద్ద సమస్యగా మారుతున్న సమయంలో ఇక్కడ రైతులను ఒప్పించే పనిలో యంత్రాంగం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నది. రైతుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు, మిగిలిన రైతులు కూడా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చే విధంగా సిఎం స్వయంగా ఇందిరమ్మ ఇండ్లను ప్రకటించారు.

4,612మంది భూనిర్వాసితులకు ఒకేసారి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని సభసాక్షిగా హామీ ఇచ్చారు. భోజనాలు పెట్టి మరీ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో భూముల పంచాయితీ, హెచ్‌సియు భూముల లొల్లి కారణంగా ఇక్కడి రైతులను ప్రోత్సహించేందుకు సిఎం ద్వారా అధికార యంత్రాంగం, పార్టీ వారు ఈమేరకు ప్రకటింపజేశారు. కేవలం తమ పార్టీ మంత్రి రాజనర్సింహ, ఇతర నేతలైన జగ్గారెడ్డి లాంటి వారి పేర్లను మాత్రమే ప్రస్తావించకుండా, విపక్ష ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి పేర్లను కూడా ప్రస్తావించడం ద్వారా అందరినీ కలుపుకొనిపోవాలన్న తపన కనిపించింది. తన హయాంలో నిమ్జ్‌ను ప్రారంభించాలన్న తపన, కసి సిఎంలో కనిపించింది. దీనివల్ల వెనుకబడిన ఈప్రాంతం ప్రగతిలో దూసుకుపోవాలన్న కారణం ఒకటి కాగా, తమ పార్టీకి చెందిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీలు ఇచ్చిన సంస్థను శాశ్వతంగా నిలపాలన్న లక్షం ఇంకొకటిగా కనపడుతున్నది.

భూసేకరణకు విపక్షాలు అడ్డుపడరాదన్న ఉద్దేశం సిఎం స్పీచ్‌లో స్పష్టంగా కనపడింది. మిగిలిన 5 వేల ఎకరాల సేకరణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. దీనికి తగిన కార్యాచరణ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని సిఎం ఆదేశించారు. మొత్తంగా నిమ్జ్ ద్వారా తమ ప్రభుత్వ ముద్ర మరింత బలంగా పడాలన్నది రేవంత్ లక్షంగా స్పష్టమయింది. కేవలం వారం రోజుల్లోనే సిఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం ద్వారా జిల్లా యంత్రాంగం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రశంసలందుకున్నారు. అటు ఎండలు, ఇటు వానలు అవాంతరాలు సృష్టించినా, బహిరంగ సభ విజయవంతం కావడం అటు అధికార యంత్రాంగానికి, ఇటు అధికార పార్టీకి సంతృప్తి కలిగించింది. రాష్ట్రంలోని గ్రామీణ జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆరుచోట్ల బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు గెలిచారు.

కేవలం నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అందుకని ఇతర ప్రాంతాల్లో కంటే కూడా ఈ జిల్లాలో విపక్షాల కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రధానంగా సీనియర్ నేత, మాజీమంత్రి హరీష్‌రావు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఓ వైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మరోవైపు సమస్యలున్న చోట ప్రత్యక్షమవుతున్నారు. ప్రజా సమస్యలపై సూటిగా, స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. సిఎం పర్యటనకు ముందు కూడా జహీరాబాద్ ప్రాంతంలో హరీష్‌రావు పర్యటించారు. ఇక కాళేశ్వరం కమిషన్ తమ అధినేత కెసిఆర్‌కు, మాజీమంత్రి హరీష్‌రావుకు నోటీస్ ఇవ్వడాన్ని ఇక్కడి బిఆర్‌ఎస్ శ్రేణులు తప్పుపడుతున్నాయి.

దీని విషయమై ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో పార్టీ అధినేత కెసిఆర్‌ను హరీష్‌రావు కలిసి చర్చించినట్లు తెలుస్తున్నది. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా కెసిఆర్‌ను ఎర్రవల్లిలో కలిసి వెళ్లారు. కెసిఆర్ తనయ, ఎంఎల్‌సి కవిత రాసిన లేఖ కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమానికి, నాటి టిఆర్‌ఎస్‌కు పురిటిగడ్డగా మెదక్ జిల్లా ఉన్నది. ఈ కారణంగా నేటి బిఆర్‌ఎస్‌లో జరిగే ప్రతి పరిణామం ఇక్కడ తీవ్రప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ ప్రాంతాల్లో పార్టీకి కరడుగట్టిన అభిమానులున్నారు. ఉద్యమకారులు, మేధావులు అశేషంగా ఉన్నారు. వారిలో చాలా మంది ఇంకా బిఆర్‌ఎస్‌కు మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. దీంతో బిఆర్‌ఎస్‌లోని తాజా పరిణామాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

  • బండారు యాదగిరి,
    (ఉమ్మడి మెదక్ బ్యూరో)
    (98489 97083)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News