డల్లాస్: MLC (మేజర్ లీగ్ క్రికెట్) 2025 విజేతగా ఎంఐ న్యూయార్క్ నిలిచింది. టెక్సాస్‌లోని డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో MI న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య ఫైనల్ సమరం జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన MI న్యూయార్క్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. బాగా పోరాడిన తర్వాత, MI న్యూయార్క్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఓపెనర్లు మోనాంక్ పటేల్, క్వింటన్ డి కాక్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. పటేల్ 22 బంతుల్లో 28 పరుగులు సాధించగా, డి కాక్ 46 బంతుల్లో 77 పరుగులు చేశాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ కూడా వేగంగా 21 పరుగులు రాబట్టాడు. దీంతో MI న్యూయార్క్ 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. సౌరభ్ నేత్రావల్కర్, గ్లెన్ మాక్స్‌వెల్, జాక్ ఎడ్వర్డ్స్, ఇయాన్ హాలండ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం 181 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ రాచిన్ రవీంద్ర 41 బంతుల్లో 70 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 34 బంతుల్లో 48 నాటౌట్ రాణించారు. అయితే, చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా.. గ్లెన్ మాక్స్వెల్ 15 పరుగుల వద్ద భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. ఫిలిప్స్ ఉన్నా.. ఒక బంతి మాత్రమే ఆడే చాన్స్ వచ్చింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో వాషింగ్టన్ ఫ్రీడమ్ 175 పరుగులకే పరిమితమైంది. న్యూయార్క్ బౌలర్లలో బౌల్ట్, రుషి ఉగార్కర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కెంజిగె ఒక వికెట్ తీశారు. వాషింగ్టన్ ఫ్రీడమ్ పై ఎంఐ న్యూయార్క్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి..రెండోసారి మేజర్ లీగ్ క్రికెట్ టైటిల్ ను కైవసం చేసుకుంది.