Monday, June 30, 2025

మాదిగలకు అండగా ఉంటూ సేవ చేస్తా: మంత్రి అడ్లూరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/తిమ్మాపూర్: మాదిగలకు పనిచేసే విషయంలో అందరికంటే ముందు ఉంటానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ అన్నారు. ఆదివారం అల్గునూర్‌లోని కేఎంఆర్ ఉన్నతి కన్వెన్షన్‌లో మాదిగ అఫీషియల్ కాంగ్రెస్ ప్రొఫెషనల్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను సామాన్య వ్యక్తినని, కష్టం తెలిసిన వాడినని, అందుకే అందరి కొత్త సుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. జడ్పీటీసీగా పనిచేసిన కాలంలో తాను పాలకుల నుండి అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, ఆ కసితోనే తాను జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే కాగలిగన్నారు. ఇప్పుడు మీ అందరి సహకారంతో మంత్రి అయ్యాయనన్నారు. నాలుగుశాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయించే శాఖలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రిని చేశారన్నారు. మరో ముఖ్య అతిథి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మాదిగ అని చెప్పుకోలేని స్థితి నుండి మాదిగ అని గర్వంగా చెప్పే స్థాయికి మాదిగ జాతి చేరుకోవడం శుభ పరిణామమన్నారు. వర్గీకరణతో మాదిగల బతుకులు మరింత బాగుపడతాయని ఆయన అన్నారు. 30ఏళ్ల వర్గీకరణ పోరాటం ముగింపు పలికిందని, సుదీర్ఘకాలం ఈ ఉద్యమాన్ని నడిపిన మందకృష్ణ మాదిగకు ఆ క్రెడిట్ దక్కుతుందన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మోతుకుపెల్లి నరసింహులు పోరాటం కూడా స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ జాతీయ ఉద్యమంలో మాదిగల పాత్ర ఘనమైనదన్నారు. మాదిగ జాతి మహోన్నతమైన జాతి అని ఆయన పేర్కొన్నారు. జగ్జీవన్‌రాం పోరాటం చేయడం వల్లనే మన దేశంలో రిజర్వేషన్లు నడుస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలోని దళితులకు మేలు జరిగిందని, అప్పుడు ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి దళితులతో పాటు నిరుపేదలకు ఇల్లు ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అందుకే రేవంత్‌రెడ్డికి మాదిగ జాతి పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ప్రొఫెసర్ చింతకింది ఖాసీం, జానపద కళాకారులు సోమన్నతో పాటు మాదిగ అఫీషియల్స్, ప్రొఫెషనల్, నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News